Covid-19: కేరళే కాదు, అంతా జాగ్రత్త పడాలి

Seroprevalence Survey: Kerala Lowest Seroprevalance Presence of Antibodies - Sakshi

గత కొన్ని వారాలుగా కేరళలోని కోవిడ్‌–19 కేసుల సంఖ్య జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని సగం కేసులు ఇక్కడినుంచే వస్తున్నాయి. జాతీయ సగటుతో (2 శాతం) పోల్చితే, అత్యధిక పాజిటివ్‌ రేటు(10 శాతం) నమోదవుతోంది. ఓనమ్‌ పండుగ సందర్భంగా, ఒక దశలో 18 శాతం పాజిటివ్‌ రేటు, దేశ కేసుల్లో మూడింట రెండొంతుల మార్కును కూడా కేరళ చేరుకుంది. ఏ మహమ్మారిలోనైనా మూడు ముఖ్యాంశాలను బట్టి వ్యవస్థ స్పందనను అంచనాకట్టొచ్చు. సంక్రమణను నెమ్మదింపజేయడం (దీనివల్ల ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేసే వీలుంటుంది); మెరుగైన ఆరోగ్య సేవల వల్ల సంక్రమించినవాళ్ల మీద పడే ప్రభావాన్ని తగ్గించగలగడం(మరణాల రేటుతో లెక్కించొచ్చు); సంక్రమణను నిరోధించడానికి తీసుకున్న చర్యలు (టీకాలు, ఇతర నియంత్రణ చర్యలు). (చదవండి: చైనాతో లడ్డాఖ్‌ లడాయి.. భారత్‌ మేల్కొనాల్సిన సమయం ఇదే!)

దేశంలోని ఏ రాష్ట్రం కన్నా కూడా సంక్రమణను నెమ్మదింపచేయడంలో కేరళ విజయవంతమైంది. 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన జాతీయ సీరో ప్రివలెన్స్‌ సర్వేలో 44.6 శాతంతో అతి తక్కువ సీరోప్రివలెన్స్‌ (రక్తంలో యాంటీబాడీల వ్యాప్తి) ఉన్నది కేరళలోనే అని వెల్లడైంది. ఇంకో రకంగా చెప్పాలంటే, మిగతా రాష్ట్రాలతో పోల్చితే సోకనివారి సంఖ్య ఇక్కడ ఎక్కువ. వాస్తవం ఏమిటంటే, డెల్టా రకం కేరళకు మిగతా దేశంతో పోలిస్తే కొంచెం ఆలస్యంగా ప్రవేశించింది. ఇప్పుడు స్థిరంగా కనబడుతున్న వ్యాప్తికి కారణం, ఈ డెల్టా. (చదవండి: ముప్పు వచ్చేసింది... మనకు మరింత!)

మరణాల సంఖ్య పరంగానూ కేరళ మెరుగ్గా ఉంది. జాతీయ సగటు 1.3 శాతం ఉన్నప్పటికీ, కేరళలో ఇది 0.5 శాతం మాత్రమే. సెకండ్‌ వేవ్‌ ఉధృతిలో దేశంలో హాస్పిటల్‌ బెడ్లు, ఆక్సిజన్, ఇతర ఆరోగ్య సరఫరాల విషయంలో సంక్షోభం తలెత్తింది. కేరళలోనూ ఒత్తిడి పెరిగినప్పటికి ఆరోగ్య వ్యవస్థ చేతులు ఎత్తేయలేదు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండి, ఇతరులకు సోకని వ్యాధుల భారం ఉన్నప్పటికీ ఇంకో రాష్ట్రమైతే బలహీనమైన ఆరోగ్య వ్యవస్థ మూలంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ ఈ విషయంలోనూ కేరళ మెరుగ్గా స్పందించింది. అలాగే కోవిడ్‌ టీకా పంపిణీ కూడా వేగంగా జరుగుతోంది. దాదాపు 21 శాతం జనాభాకు పూర్తి టీకా వేశారు. 58 శాతం జనాభాకు కనీసం ఒక్క డోసైనా పడింది.

అత్యధిక వ్యాప్తికి అవకాశముండే చోట్ల, ఇప్పటికీ కాంటాక్టులను వెతికి పట్టుకుని కోవిడ్‌–19 పరీక్షలు చేస్తున్న అతి కొద్ది రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఒక విధంగా అత్యధిక పాజిటివ్‌ రేటుకు ఇది కూడా కారణం. అలాగే, వచ్చిన అన్ని కేసులను నివేదించడం బాగా పనిచేసే వ్యాధి పర్యవేక్షక వ్యవస్థ లక్షణం. కాబట్టి, సరైన రీతిలో స్పందిస్తున్నందుకు కేరళను నిందించకూడదు. స్వల్ప వ్యవధిలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అత్యధిక మందికి సోకిన డెల్టా, కేరళలో నెమ్మదిగా వ్యాపించడం కూడా రాష్ట్ర పనితీరుకు నిదర్శనం. అయితే ప్రతిదీ కేరళ సరిగ్గా చేసిందని కాదు. ఎక్కువ జనం పోగయ్యే ఓనమ్‌కు సడలింపులిచ్చింది. ఎన్నికల ర్యాలీలకు అనుమతించింది. ఈ పరిణామాలు కూడా కేసుల పెరుగుదలకు కారణమైనాయి.

స్పష్టంగా ఈ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రమైనా జనాలు పోగయ్యే సందర్భాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించాలి. స్థిరమైన సంక్రమణలను దృష్టిలో ఉంచుకుంటూ, కేరళ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణ, అన్‌లాక్‌ వ్యూహం మరింత పకడ్బందీగా అమలుచేయాలి. స్థానిక సంస్థలను చురుకైన భాగస్వాములను చేయాలి. టీకాలు వేసుకోనివాళ్లు ప్రజా సమూహాల్లోకి హాజరు కాకుండా చూసుకోవాలి. ఏ పండుగకైనా సడలింపులు ఇవ్వడం మానుకోవాలి. టీకాల వేగం మరింత పెరగాలి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ తరచూ చేయాలి.

ఇండియా ఇంకా మహమ్మారి మధ్యలోనే ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ భిన్న రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త రకం ప్రబలితే పరిస్థితి మారిపోవచ్చు. థర్డ్‌ వేవ్‌కు అవకాశం ఉండటంతోపాటు, వ్యాధి ‘ఎండెమిక్‌’(సీజనల్‌ వ్యాధి కావడం) అవడానికి ఇంకా చాలా నెలలు పట్టొచ్చు. అందుకే ఏ రాష్ట్రమైనా కేసుల సంఖ్యతో నిమిత్తం లేకుండా సర్వ సన్నద్ధంగా ఉండాలి. ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. ఇతర రాష్ట్రాల అనుభవాల నుంచి నేర్చుకోవాలి. అదే మహమ్మారి మీద జరిగే పోరాటంలో ఇండియాను గెలిపించగలదు.

- డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా
ఎపిడీమియాలజిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top