భారత్‌ మేల్కొనాల్సిన సమయం ఇదే!

Pravin Sawhney Article On Ladakh Stand Off Has Exposed India Against China - Sakshi

విశ్లేషణ

చైనా, పాకిస్తాన్‌ మన సరిహద్దుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలను సైతం ‘మొదటగా ప్రయోగించం’ అనే విధానాన్ని భారత్‌ ఇప్పటికైనా వదిలేయాలన్న ఆలోచనలకు బలం చేకూరుతోంది. లడ్డాఖ్‌ అనుభవాల తర్వాత భారత్‌ యుద్ధంలో నేరుగా చైనాను ఢీకొట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భారత అణు విధానం ఎలా ఉండాలి? సంప్రదాయ రీతుల్లోనూ పీఎల్‌ఏ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఎలా? పీఎల్‌ఏ తరహాలో భారత మిలటరీలో సంస్కరణలు చేపట్టడం ఎలా? రక్షణ పరంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో ఆలస్యం జరిగేందుకు వీల్లేదు.              

చైనాతో లడ్డాఖ్‌ లడాయి ఇంకా ముగియలేదు. అక్కడ సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిన పొరుగు దేశం మన మిలటరీ శక్తి సామర్థ్యాలను పరీక్షకు నిలపడమే కాకుండా... అణ్వస్త్ర నిరోధకతపై భారత విదేశాంగ విధానంలోని డొల్లతనాన్నీ బట్టబయలు చేసింది. ఆ మాటకొస్తే భారత్‌ అణ్వాయుధాలు తనకో లెక్కే కాదన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది.

1998 మే 11, 13 తేదీల్లో భారత్‌ వరుసగా ఐదు అణు పరీక్షలు నిర్వహించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు ఒక లేఖ రాశారు. చైనా, పాకిస్తాన్‌ కుమ్మక్కై అణు పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగానే భారత్‌ కూడా అణు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందని ప్రస్తావించడమే కాకుండా... భారత్‌ ముందస్తు అణ్వస్త్ర ప్రయోగం చేయదని హామీ కూడా ఇచ్చారు. ఈ విధానాన్ని ప్రస్తుత పరిణామాలకు అన్వయించుకుంటే... ముందుగా చైనా దాడి చేస్తేనే మనం ప్రతిదాడికి పాల్పడగలం. అయితే ఈ ప్రతిదాడులు జల, వాయు, భూతల మార్గాల్లో ఏదైనా కావచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ రెండు వైపుల నుంచి యుద్ధం చేసే పరిస్థితి లేదు. అగ్ని–5 ద్వారా భూతలంపై నుంచి చైనాపై అణుదాడి చేయవచ్చు కానీ.. ఈ క్షిపణి ఇంకా రక్షణ దళాల సేవకు సిద్ధంగా లేదు. సముద్రమార్గం గుండా దాడి చేసేందుకు భారత్‌ సొంతంగా తయారు చేసుకున్న ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. దీనికి సాయంగా పనిచేసే ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను కే–4 జలాంతర్గాములను ఉపయోగించి చైనాకు 3,500 కిలోమీటర్ల దూరం నుంచి ఢీకొట్టాలి. కానీ కే–4ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 

ప్రతిదాడులు చేసే సన్నద్ధత కరువైన నేపథ్యంలో భారత్‌ తన ‘నో ఫస్ట్‌ యూజ్‌ పాలసీ’లో మార్పులు చేసుకోవాలని కొందరు రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్‌ మీనన్‌ కొన్నేళ్ల క్రితం రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. అణ్వాస్త్రాల నిరోధానికి కాకుండా యుద్ధాన్ని గెలిచే ఆయుధాలుగా భారత్‌ పరిగణించాల్సిన సమయం ఇదేనని, తద్వారా సంప్రదాయ యుద్ధరీతుల్లో చైనా కంటే తక్కువ అన్న నూన్యతాభావాన్ని పూరించుకోవచ్చునన్నది వీరి విశ్లేషణ. అణ్వాయుధ దేశాలు యుద్ధానికి దిగే పరిస్థితి లేదని అనుకుంటే భారత్, చైనా మధ్య యుద్ధం జరగనే జరగదు. ఒకవేళ జరిగితే సరిహద్దుల వద్ద పరిమిత స్థాయిలోనే ఉంటుంది. కానీ ఈ అంచనాపై సరైన విశ్లేషణ జరగలేదు.

ఎవరి శక్తి ఎంత?
భారత్‌ విషయాన్ని విశ్లేషించే ముందు ప్రపంచంలోని అణ్వాయుధ దేశాల పరిస్థితి ఒక్కసారి తెలుసుకుందాం. 1950లలో సంప్రదాయ యుద్ధంలో అమెరికా మిలటరీపై సోవియట్‌ యూనియన్‌దే పైచేయిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కొంచెం వెనుకబడే ఉన్నప్పటికీ వాసి కంటే రాశి మేలన్న అంచనాతో సోవియట్‌ యూనియన్‌ ఉండేది. నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ ఐసెన్‌ హోవర్‌ సోవియట్‌ యూనియన్‌తో ట్యాంకులు, గన్నుల విషయంలో పోటీపడలేదు. బదులుగా వ్యూహాత్మక అణ్వాయుధాలతో యూరప్‌లో సోవియట్‌ యూనియన్‌కు చెక్‌ పెట్టగలిగారు. శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉండటంతో అమెరికా మాట చెల్లుబాటైంది కూడా. సోవియట్‌ యూనియన్‌  అణ్వాయుధ ప్రతిదాడికి పాల్పడితే భారీ అణ్వాస్త్రాలతో దానిపై దాడి చేయాలన్న ‘న్యూలుక్‌’ వ్యూహంతో అమెరికా వ్యవహరించింది. 

1970లకు వచ్చేసరికి సోవియట్‌ యూనియన్‌ సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యూహాత్మక అణ్వాయుధాల విషయంలో అమెరికాకు సమానంగా ఎదిగింది. దీంతో అమెరికా అణ్వాయుధాలు, సంప్రదాయ క్షిపణుల మేళవింపుతో శత్రువుకు చెక్‌ పెట్టాలన్న ‘సెకెండ్‌ ఆఫ్‌సెట్‌’ పాలసీని ఆచరణలో పెట్టింది. కానీ ఇటీవలి కాలంలో చైనా కూడా తనదైన రీతిలో అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోంది. తైవాన్‌ జలసంధి, దక్షిణ చైనా సముద్రాల్లో ఇరుపక్షాలు నిత్యం మోహరించి ఉండటం ఇందుకు ఉదాహరణ. ఈ రెండు ప్రాంతాల్లోనూ నౌకల సురక్షిత ప్రయాణానికి గస్తీ కాస్తున్న అమెరికా ఏ క్షణంలో చైనా గీసిన గీతను దాటుతామో అన్న ఆందోళనతో పనిచేస్తోంది. సంప్రదాయ యుద్ధంలో చైనాను ఢీకొట్టి గెలవడంపై అమెరికాకూ కొన్ని సందేహాలు ఉన్నాయి. 

హద్దుల నిర్ణయానికి సంప్రదింపులు...
బైడెన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికా చైనాతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సీనియర్‌ వైస్‌ ఛైర్మన్‌ జనరల్‌ షూ కిలియాంగ్‌ను కలిసి ఎవరి పరిధి ఎంతవరకో నిర్ణయించుకునేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి చైనా ససేమిరా అంటోంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రాల్లో ఈ అసందిగ్ధ పరిస్థితులు కొనసాగితే ఆసియన్‌ దేశాలకూ ముప్పే. అందుకే ఈ దేశాలు కొంచెం వెనక్కు తగ్గాల్సిందిగా అమెరికా మిలటరీకి  విజ్ఞప్తి చేశాయి కూడా.

అమెరికా పరిస్థితి ఇలా ఉంటే... అమెరికా వద్ద ఉన్న భారీ అణ్వాయుధ సంపత్తి, ముందస్తు వాడకానికి వెనుకాడని అమెరికా వైఖరిపై చైనా ఆందోళన చెందుతోంది. ఈ కారణంగానే అణ్వాయుధాల తగ్గింపునకు అమెరికా, రష్యా చేసుకున్న ఒప్పందం ‘స్టార్ట్‌’లో భాగస్వామి అయ్యేందుకు చైనా నిరాకరిస్తోంది. తమ అణ్వాయుధాలు తక్కువే కాకుండా చిన్నవని చెబుతూనే చైనా ముందస్తు అణ్వాయుధ ప్రయోగమన్న విధానాన్ని మార్చుకునేందుకూ తటపటాయిస్తోంది. ఫలితంగా మరిన్ని వ్యూహాత్మక ఆయుధాలను సముపార్జించుకోవడంతోపాటు అణ్వాయుధ నిరోధ విధానాన్ని అడ్డుగా పెట్టుకుని అమెరికా దుందుడుకు చర్యలకు పాల్పడకుండా నియంత్రించాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా ‘నో ఫస్ట్‌ యూజ్‌’ పాలసీని వదిలేయాలన్న ఆలోచనకు బలం చేకూరుతోంది. కానీ మనం ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశమూ ఉండదు.   హెచ్చరించడం కోసమైనా చైనా తన ఆయుధసంపత్తిని వాడటం మొదలుపెడితే అది మనకు ఆత్మహత్యా సదృశ్యమవుతుంది. అలాగని పరిమిత స్థాయిలో సంప్రదాయ యుద్ధంలోనూ మనం చైనాను ఢీకొట్టే పరిస్థితి లేదు. 

సశేష ప్రశ్నలు బోలెడు...
చైనాతో అటు సంప్రదాయ రీతుల్లో, ఇటు అణ్వాయుధాలతో సరితూగని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాన్ని ఎదుర్కొనే విషయంలో ఎన్నో ప్రశ్నలు సశేషంగానే మిగిలి ఉన్నాయి. అణ్వాయుధాలను యుద్ధ నివారణకు పావుగా వాడటం ఎలా? భారత అణు విధానం ఎలా ఉండాలి? అణ్వాయుధ నిరోధ విధానం విఫలమైన నేపథ్యంలో అగ్ని–5, అణ్వాయుధ క్షిపణులతో కూడిన జలాంతర్గాముల పాత్ర ఏమిటి? సంప్రదాయ రీతుల్లోనూ పీఎల్‌ఏ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఎలా? పీఎల్‌ఏ తరహాలో భారత మిలటరీలో సంస్కరణలు చేపట్టడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో ఆలస్యం జరిగేందుకు వీల్లేదు. లడ్డాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఆక్రమించుకున్న భూభాగాలను సుస్థిరం చేసుకునేందుకు చైనా ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు పాకిస్తాన్‌ మనకంటే ఎక్కువ అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు వస్తున్న సమాచారం ఏమంత మంచిది కాదు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తరువాత చైనా, పాక్‌ మధ్య మిలటరీ పరమైన బం«ధం దృఢమైంది. ఒకవేళ భారత్‌ చైనాల మధ్య యుద్ధమంటూ వస్తే... పాకిస్తాన్‌ అనుకోని అతిథిలా రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఉత్తర దిక్కునే కాదు.. పశ్చిమంలోనూ భారత్‌ పరిస్థితి కష్టతరమవుతోందనేది సత్యం. ఇది భారత్‌ మేల్కొనాల్సిన సమయం.

వ్యాసకర్త:  ప్రవీణ్‌ సాహ్నీ
 ఫోర్స్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top