కీసర.. జన జాతర | keesara is totally with devotional | Sakshi
Sakshi News home page

కీసర.. జన జాతర

Feb 18 2015 8:49 AM | Updated on Mar 28 2018 11:11 AM

ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట మంగళవారం ఓంకారనాదంతో ప్రతిధ్వనించింది.

కీసర: ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట మంగళవారం ఓంకారనాదంతో ప్రతిధ్వనించింది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిల్చున్నారు. సాయంత్రం వరకు దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు స్వామివారిని  దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు నందివాహన సేవను కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దర్శనానంతరం భక్తులు ఐదంతస్తుల రాజగోపురానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పసుపు, కుంకుమ, పాలు, నూనె, నెయ్యితో అభిషేకాలు చేశారు. మండపంలో పెద్ద ఎత్తున సామూహిక అభిషేకాలు నిర్వహించారు.
 
స్వామిసేవలో ప్రముఖులు..
కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరుడిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ చామకూర మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మేడ్చల్, ఉప్పల్ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ రజత్‌కుమార్ సైనీ, హైదరాబాద్ కలెక్టర్ నిర్మల, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు.
 
విశేషాలు..

- బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం వారు జారీ చేసిన వీఐపీ లింకు, వీఐపీ పాసులు భక్తుల సహనానికి పరీక్షపెట్టాయి.  వీఐపీలింకు పాసులను 1500 మాత్రమే జారీ చేస్తామని చెప్పిన అధికారులు ఆ పాసుల సంఖ్యను 4వేలకు పైగా పంపిణీ చేశారు. అధికారులు వీవీఐపీల కోసం ఏర్పాటు చేసిన  ప్రత్యేక క్యూలైన్ ద్వారా త మ సిబ్బందిని, బంధువులను పంపించడం భక్తులను అసహనానికి గురిచేసింది.  
- క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు భారతి సిమెంట్, దేవస్థానం వారు మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేసారు.
    ఉదయం 11 గంటల వరకు ఓ మెస్తారుగా ఉన్న భక్తుల రాక ఆ తరువాత అనూహ్యంగా పెరిగింది. ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లు కిక్కిరిపోయాయి. దీంతో అధికారులు ప్రత్యేక దర్శనాలకు తరచూ విరామం ప్రకటిస్తూ ధర్శదర్శనాలను కొనసాగించారు.
- మధ్యాహ్నం వివిధశాఖల అధికారులు, పార్టీల నేతలు తమ బంధుగ ణం, నాయకులను గర్భాలయంలోకి తీసుకెళ్తుండడంతో జేసీ రజత్‌కుమార్‌సైనీ రంగంలోకి దిగారు. గర్భాలయంలోకి ఎవరినీ వెళ్లకుండా బయటినుంచే స్వామివారిని దర్శించుకునేలా ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి క్యూలైన్లలో వెళ్లే భక్తులకు ఏవిధంగా దర్శనం అవుతుందో పరిశీలించారు.
- శివరాత్రి జాగరణను పురస్కరించుకొని జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మధ్యాహ్నానికే ప్రసాదాల కొరత ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు.
- స్థానిక మార్వాడి సంఘం, ఆర్యవైశ్య సంఘం, వంశరాజ్ సంక్షేమ సంఘం, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.  
- మంగళవారం ఒక్కరోజే 5 లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు.
 
 నేటి పూజా కార్యక్రమాలు

 - ఉదయం 5.30 గంటల నుంచి:  మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
 - ఉదయం 6 గంటల నుంచి: కల్యాణమండపంలో సామూహిక అభిషేకములు
 - ఉదయం 8 గంటలకు: అన్నాభిషేకం
  -ఉదయం 9 గంటలకు: రుద్రస్వాహకార హోమం
  - రాత్రి 7 గంటల నుంచి: ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పము
 - రాత్రి 10 గంటలకు: స్వామివారి విమాన రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement