
కోనాయిపల్లి వెంకటేశ్వర దేవాలయం
సాక్షి, నంగునూరు(సిద్దిపేట): కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని నేతగా కేసీఆర్ గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను నమ్ముకున్న వెంకన్న ఆశీస్సులు తీసుకొని కొత్త పార్టీని స్థాపించడం.. అనతి కాలంలోనే టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజాదరణ లభించింది. నామినేషన్‌కు ముందు వేంకటేశ్వరాలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మే కేసీఆర్.. నాటి నుంచి నేటి వరకు అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం.. తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంతో ఆయన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆలయంలో స్వామివారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైతే గుడికి వచ్చి పూజలు చేస్తానని 1985లో కేసీఆర్ మొక్కిన మొక్కు నెరవేరడంతో సుదీర్ఘ కాలంగా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి ఏ కొత్త పని ప్రారంభించినా ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. అలాగే 1985 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో నామినేష్ పత్రాలకు ఆలయంలో పూజలు చేస్తూ ఎమ్మెల్మేగా గెలుపొందారు. 2001లో వెంకన్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని సంవత్సరాల్లోనే టీఆర్‌ఎస్ పార్టీకి గుర్తింపు రావడంతో సెంటిమెంట్ మరింత బలపడింది.
2004లో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలపై అక్కడే సంతకం చేశారు. రెండింటిలో భారీ మెజారిటీ సాధించగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా, 2014లో గజ్వేల్ ఎమ్మెల్యే నామినేషన్ వేసే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గజ్వెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకున్న కేసీఆర్ బుధవారం వేంకటేశ్వరాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయనున్నారు.