అధినేత కేసీఆర్ | KCR unanimously re-elected as TRS chief | Sakshi
Sakshi News home page

అధినేత కేసీఆర్

Apr 21 2015 2:33 AM | Updated on Aug 15 2018 9:27 PM

అధినేత కేసీఆర్ - Sakshi

అధినేత కేసీఆర్

టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీఆర్‌ఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవం
24న ప్లీన రీలో అధికారిక ప్రకటన
పోటీ లేదని ప్రకటించిన మంత్రి నాయిని
27న పది లక్షల మందితో బహిరంగ సభ


సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు గడువు ముగిసే వరకు ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో కేసీఆర్ ఏకగ్రీవమయ్యారు. 24వ  తేదీన జరగనున్న పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.

కేసీఆర్ తరఫున పార్టీకి చెందిన నాయకులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంత్రుల తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీల నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుల తరఫున నల్లగొండ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల పక్షాన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ల తరఫున ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్ కవిత, అడహాక్ కమిటీ నుంచి కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. ఇతర నేతలు ఆయన పేరును బలపరిచారు.

గడువులోగా దాఖలైన నామినేషన్లను పరిశీలించామని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని మంత్రి నాయిని మీడియాతో చెప్పారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించుకునే విషయం అధినేత కేసీఆర్ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్ ఎదిగింద ని, అంతా కలసి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందని, కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించామని, వారందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మంత్రి నాయిని పేర్కొన్నారు.

27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి రాజధాని నగరాన్ని గులాబీ మయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, మహేం దర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement