కొండపోచమ్మ లిఫ్టు సిద్ధం చేయండి 

KCR Orders To Transco CMD Prabhakar Rao Over Konda Pochamma Lift - Sakshi

ట్రాన్స్‌కో సీఎండీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ప్రభాకర్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం రంగనాయకసాగర్‌ వరకు విజయవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వస్తున్నదని, ఆ నీటిని ఈ వానాకాలంలోనే కొండపోచమ్మసాగర్‌ వరకు తరలించేందుకు విద్యుత్‌ శాఖ చేస్తున్న ఏర్పాట్ల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కారం, మర్కూక్‌ పంపుహౌజుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు సీఎం ఫోన్‌ చేసి మాట్లాడారు. కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై ఆరా తీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు. ఈ వానాకాలంలోనే కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలిస్తామన్నారు. విద్యుత్‌ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పనులు పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం ప్రశంసించారు.

నాలుగైదు రోజుల్లో లిఫ్టులు సిద్ధం: సీఎండీ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయక్‌ సాగర్‌ వరకు విజయవంతంగా లిఫ్టు చేయగలుగుతున్నామని, అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్‌ పంపుహౌజుల పనులను ప్రభాకర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.

‘ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రంగనాయక్‌ సాగర్‌ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు, తర్వాత కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నది. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్‌ చేరుకుంటుంది. మర్కూక్‌ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు సిద్ధమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. టెస్టింగ్‌ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం’అని సీఎండీ చెప్పారు. ప్రభాకర్‌రావు వెంట ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ జె.సూర్యప్రకాశ్, ఈడీ ప్రభాకర్‌రావు, ఎస్‌ఈ ఆంజనేయులు, వేణు తదితరులున్నారు.

ముంబై నుంచి నిపుణుల బృందం రాక 
పంపుహౌజుల కేబుల్‌ పనులు చేసే రాహుల్‌ కేబుల్‌ ఇంజనీరింగ్‌కు చెందిన నిపుణుల బృందం లాక్‌డౌన్‌ కారణంగా ముంబైలో చిక్కుకుంది. వారు వస్తే తప్ప ఇక్కడ పనులు జరిగే అవకాశం లేదు. దీంతో ప్రభాకర్‌రావు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. డీజీపీ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసి, ఫోన్‌ ద్వారా మాట్లాడి ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దీంతో ప్రత్యేక అనుమతితో కూడిన వాహనాల్లో నిపుణుల బృందం ఈ నెల 21న సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. వారి ఆధ్వర్యంలో పంపుహౌజుల కేబుల్‌ పనులు నడుస్తున్నాయి.

తొలగిన అడ్డంకి 
► మే 1లోగా కొండపోచమ్మ  ముంపు గ్రామాల బాధితుల్ని ఖాళీ చేయించండి 
► సిద్దిపేట కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ ముంపునకు గురయ్యే మామిడ్యాల, బహిలాంపూర్‌ గ్రామాల వారిని మే 1వ తేదీలోగా ఖాళీ చేయించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ములుగు మండలంలోని ఆ రెండు గ్రామాలకు చెందిన 55 కుటుంబాలను పునరావాస పథకం కింద నిర్మించిన గృహాల్లోకైనా.. లేదా తాత్కాలిక నివాసాల్లోకైనా తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మంది దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను గురువారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం.. పిటిషనర్లకు చెల్లించాల్సిన 55 మంది ఇళ్ల పరిహారం, పట్టాలను పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి అందజేయాలని ఆదేశించింది. పరిహార వివాదాల పేరిట ప్రాజెక్టులపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించలేమని కూడా స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణాలపై అభ్యంతరాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు చెప్పింది.  తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top