డిసెంబర్‌1న ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ భేటీ

KCR To Hold Meeting With RTC Employees On December 1st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో మలుపుల తర్వాత టీఎస్‌ ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడగా కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ఆదివారం (డిసెంబర్‌ 1) ప్రగతి భవన్‌లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, ఇందుకోసం వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులండాలన్నారు.

సమావేశాల్లో అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులు ప్రగతి భవన్‌కు చేరుకోవాలన్నారు. సమావేశానికి వచ్చే కార్మికులకు ప్రగతి భవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి.. అనంతరం వారితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి అజయ్‌ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు పాల్గొననున్నారు. 52 రోజుల సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. నేడు ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల్లో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top