
సాక్షి, హైదరాబాద్ : ఐదు ప్రగతి వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతోందని, అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. తొలి ఐదేళ్ల కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన అడుగులు పడ్డాయన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలలో భాగస్వామ్యం కావాల ని ప్రజలకు పిలుపునిచ్చారు. సంఘటిత శక్తిని ప్రదర్శించి, ఫలితాలు సాధించుకున్న స్వీయానుభవం కలిగిన తెలంగాణ సమాజం, అదే స్ఫూర్తితో నిర్ధేశిత లక్ష్యాలను సాధించగలుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు.