ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్లు

KCR Actions Towards Elections Promises - Sakshi

57 ఏళ్లు నిండిన వారికి పంపిణీ

ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ షురూ

9,355 గ్రామ కార్యదర్శుల నియామక ఉత్తర్వులు

27న ఎల్బీ స్టేడియంలో ‘పంచాయతీరాజ్‌’ సదస్సు

19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ 

పంచాయతీరాజ్‌ శాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు

ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ఫుల్‌ జోష్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి 57 ఏళ్ల వయస్సు నిండిన పేదలకు వృద్ధాప్య పింఛన్ల పం పిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచిం చారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ఆయన పంచా యతీరాజ్‌ అంశాలతో పాటు ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే పల్లెలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియ మించాలన్నారు. కొత్తగా రూపొందించిన  పంచాయతీరాజ్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలన్నారు. 

9,355 మంది కార్యదర్శుల నియామకం..
రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది. నియామకానికి సంబంధించి కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని అన్నారు.

57 ఏళ్లు నిండిన వృద్ధులకు పింఛన్లు..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌ అందించనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019–20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్‌ మాసం నుంచి పింఛన్లు అందివ్వాలని చెప్పారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం..
అలాగే ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి, భాన్సువాడ నియోజకవర్గం పరిధిలో చండూరు, మోస్ర, మహబూబాబాద్‌ పరిధిలో ఇనుమర్తి, సిద్ధిపేట పరిధిలో నారాయణపేట మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు. 

19 నుంచి బతుకమ్మ చీరలు..
బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఫిర్యాదుతో ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. 

ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ చెక్కులు...
కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని సీఎం చెప్పారు. ఎన్నికల కోడ్‌ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. 

27న పంచాయతీరాజ్‌ అవగాహన సదస్సు..
కొత్తగా నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యదర్శులతో కలసి మొత్తం 12,751 వేల మంది కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఇవోపీఆర్డీలు, డీపీఓలు, డీఎల్పీఓలతో ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. మధ్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. 
ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్‌ రావు, రాజేశ్వర్‌ తివారి, రామకృష్ణారావు, వికాస్‌ రాజ్, స్మితా సబర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్‌ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top