జూరాలకు 2.5 టీఎంసీలు | Karnataka Government Agreed To Release 2.5 TMC Water To Jurala | Sakshi
Sakshi News home page

జూరాలకు 2.5 టీఎంసీలు

May 4 2019 2:59 AM | Updated on May 4 2019 2:59 AM

Karnataka Government Agreed To Release 2.5 TMC Water To Jurala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ శుక్రవారం ఫోన్‌ చేసి కోరారు. కేసీఆర్‌ అభ్యర్థనపై అక్కడి అధికారులతో చర్చించిన కుమార స్వామి తెలంగాణకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్‌ చేసి కేసీఆర్‌కు తెలిపారు. ఇది మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్‌ అన్నారు. ఆ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు.

వారం రోజుల్లో జూరాలకు... 
నిజానికి జూరాల వాస్తవ నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీ కాగా ప్రస్తుతం అందులో కేవలం 1.93 టీఎంసీల నీటి నిల్వే ఉంది. పూర్తిగా డెడ్‌స్టోరేజీకి నిల్వలు చేరడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలు తీరడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి నీటి విడుదల అవస్యం కావడంతో కేసీఆర్‌.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నీటి విడుదలకు ఒప్పించారు. ప్రస్తుతం ఎగువ నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గానూ 18.64 టీఎంసీల నిల్వలున్నాయి. అయితే ఇక్కడ ఎండీడీఎల్‌ పరిధిలోనే నీరుండటంతో ఆల్మట్టిలో లభ్యతగా ఉన్న 31.58 టీఎంసీల నిల్వల నుంచి కర్ణాటక నారాయణపూర్‌కు నీటి విడుదల చేసి, అటు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి లేక శనివారం నీటి విడుదల మొదలు పెట్టినా, వారం రోజుల్లో నీరు జూరాలకు చేరుతుందన్నారు. ఒక టీఎంసీ నీరు జూరాలను చేరినా జూన్‌ మొదటి వారం వరకు మహబూబ్‌గనర్‌ జిల్లా తాగునీటి అవసరాలు తీరినట్టేనని పేర్కొంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement