ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ, పునరావాసానికి ప్రత్యేక అథారిటీ
1,33,867 ఎకరాల భూసేకరణకు మార్గదర్శకాలు
ఏటా రూ.18 వేల కోట్లు వ్యయం చేసి నాలుగేళ్లలోగా 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తామని కర్ణాటక సర్కారు వెల్లడి
గత నెల 16న కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేస్తూ ఆ రాష్ట్ర జలవనరులశాఖ ఉత్తర్వులు
ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఆంధ్ర ఎడారిగా మారడం ఖాయం
అయినా రాష్ట్ర హక్కుల పరిరక్షణపై నోరుమెదపని చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 16న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 75,563 ఎకరాల భూసేకరణ.. 20 గ్రామాలతోపాటు బాగల్‌కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పనకు 6,467 ఎకరాలు.. 5.94 లక్షల హెక్టార్లకు నీళ్లందించడానికి వీలుగా కాలువల తవ్వకానికి 51,837 ఎకరాలు వెరసి 1,33,867 ఎకరాల సేకరణకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేస్తూ ఈనెల 9న కర్ణాటక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎకరం మగాణి భూమికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి రూ.30 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఏటా రూ.18 వేల కోట్ల చొప్పున వ్యయం చేసి నాలుగేళ్లలోగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా ఆల్మట్టి డ్యాం గరిష్ఠ నీటి మట్టాన్ని 519.6 మీటర్లు(129.72 టీఎంసీలు) నుంచి 524.256 మీటర్లు(279.72 టీఎంసీల)కు పెంచే ప్రక్రిను పూర్తి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న 1996–2003 మధ్య ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు కర్ణాటక సర్కార్ పెంచేసింది.
2003–04 ముందు వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నాలుగో వారంలోనే ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చేది. కానీ.. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకు పెంచడంతో శ్రీశైలానికి వరద జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఉదాహరణకు 2015–16లో కృష్ణా నుంచి శ్రీశైలానికి కేవలం 24.97 టీఎంసీలే వచ్చాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే.. నీటి నిల్వ మరో వంద టీఎంసీలు పెరుగుతుంది.
అదనంగా 5.94 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే వ్యవస్థ కర్ణాటకకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆల్మట్టిలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా కర్ణాటక సర్కార్ ఆయకట్టుకు తరలిస్తుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చే అవకాశమే ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.
అయినా సరే చంద్రబాబు సర్కార్ 1996–2003 తరహాలోనే ఇప్పుడు మొద్దునిద్ర పోతోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేసినా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


