అద్దాలు ఇయ్యలె.. ఆపరేషన్లు చెయ్యలె!

Kanti Velugu Scheme Delayed In Medchal - Sakshi

మేడ్చల్‌ జిల్లాలో 4.38 లక్షల మందికి నేత్ర పరీక్షలు  

కళ్లద్దాలు ఇచ్చింది 71 వేల మందికే..

58,490 మందికి ఇప్పటికీ అందని వైనం

31,245 శస్త్ర చికిత్సలకుగాను చేసింది 547 మాత్రమే

ఆస్పత్రుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: కంటి వెలుగు పథకంలో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో ఇప్పటివరకు 4.38 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు కానీ వీరిలో అవసరమున్నవారికి సకాలంలో కళ్ల జోళ్లు అందడంలేదు. కంటి శస్త్ర చికిత్సలను చేయడంలేదు. దీంతో బాధితులు ఆస్పత్రుల చుట్టూ తిరుతున్నారు. జిల్లాలో 23.62 లక్షల జనాభా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18.12 లక్షలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 3.72 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.75 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 52 బృందాలు (అర్బన్‌ పరిధిలో 43, రూరల్‌ ప్రాంతాల్లో 9) కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు  4.38 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 71 వేల మందికి మాత్రమే కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు జిల్లా కంటి వెలుగు కోఆర్డినేటర్‌ డాక్టరు ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మరో 58,490 మందికి కంటి అద్దాలు తెప్పించనున్నారు. దీంతో కంటి అద్దాలు పొందాల్సినవారు క్యాంపులు, ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కంటి పరీక్షలు చేసుకున్న వారిలో 31,245 మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. జిల్లాలో గుర్తించిన సంబంధిత ఆస్పత్రులకు సిఫారస్‌ చేసినప్పటికీ ఇప్పటి వరకు 547 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కంటి శస్త్ర చికిత్సల నిర్వహణలో వరంగల్‌ తదితర జిల్లాల్లో తలెత్తిన లోపాలను దృష్టిలో పెట్టుకుని అర్హత కలిగిన ఆస్పత్రులకు తిరిగి సిఫారస్‌ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో  జాప్యం జరుగుతోందని సమాచారం.  కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన 30,698 మంది తమకు కేటాయించిన ఆస్పత్రులతో పాటు హైదరాబాద్‌ నగరంలోని కార్పొరేట్‌ కంటి దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. పెద్దాస్పత్రులకు చెందిన వర్గాలు మాత్రం ఎన్నికల కోడ్‌ కారణంగా శస్త్ర చికిత్సలు నిలిపివేసినట్లు చెబుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top