
భార్యను కడతేర్చిన భర్త
కత్తితో గొంతు కోసి పరారీ
నిందితుడి కోసం గాలింపు..
కుషాయిగూడ(హైదరాబాద్): భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి నిద్రిస్తున్న ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అణుపురంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా, అడ్డగూడురు గ్రామానికి చెందిన బోడ శంకర్‌కు అదే మండలం గోవిందపురం గ్రామానికి చెందిన మంజులతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శంకర్ పెళ్లికి ముందు నుంచే ముంబైలోని అక్క ఇంట్లో ఉంటూ ఫ్లంబర్‌గా పనిచేసేవాడు. వివాహం అనంతరం భార్య మంజులను ముంబై తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై శంకర్ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శంకర్ తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక మంజుల ఈ నెల 14న ముంబై నుంచి ఏఎస్‌రావునగర్, అణుపురం కాలనీలో ఉంటున్న అక్క రాణి ఇంటికి వచి్చంది. దీంతో శంకర్ కూడా తన చిన్న కొడుకును వెంట తీసుకొని ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చి భార్యను కలిశాడు. శుక్రవారం రాత్రి మంజులకు వరుసకు సోదరుడైన తోటకూర నగేష్ ఇంట్లో పంచాయతీ చేసిన పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం అందరూ కలిసి రాణి ఇంటికి తిరిగి వెళ్లారు. అందరూ నిద్రిస్తుండగా శంకర్ తన పక్కనే పడుకున్న మంజులపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు.
మంజుల కేకలు విని కుటుంబ సభ్యులు మేల్కొనడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతురాలి సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్య అనంతరం నిందితుడు ఇంటి నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పరారీలో ఉన్న నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.