కాకతీయ ఉత్సవాలు డిసెంబర్ 27 నుంచి...


హన్మకొండ అర్బన్ : వచ్చే నెల 27, 28, 29వ తేదీల్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. హన్మకొండలోని కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం కాకతీయ ఉత్సవాలపై ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.



ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించేందుకు ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, పాపారావు, టూరిజం, కల్చరల్ సెక్రటరీ బీపీ.ఆచార్య, సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు వివరించారు.



వరంగల్ జిల్లాలోని రామప్ప, గణపురం, ఖిలా వరంగల్, వేయిస్తంభాల ఆలయంతోపాటు నల్లగొండ జిల్లా పొనగల్లు, ఖమ్మం జిల్లా పెర్టు, మెదక్ జిల్లా కోలచలను, హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం, కరీంనగర్‌లోని ఎలగందుల పోర్టు, రంగారెడ్డిలోని అనంతగిరి, ఆదిలాబాద్‌లోని గాంధారికోట, మహబూబ్‌నగర్‌లోని అలంపూర్, నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి ప్రదేశాల్లో వైభవంగా నిర్వహించాలని ఇదివరకే ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ గంగాధర కిషన్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top