ఆష్టా నుంచి లండన్‌ దాకా.. | Sakshi
Sakshi News home page

ఆష్టా నుంచి లండన్‌ దాకా..

Published Mon, Jul 2 2018 6:11 PM

Janapada Kalakarudu Aasta Gangadhar - Sakshi

భైంసా(ముథోల్‌) : చదువుల తల్లి నిలయమైన ముథోల్‌ నియోజకవర్గంలో జానపద కళాకారులు ఎంతోమంది ఉన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి పాదాల చెంత పెరిగిన ఆష్టా గ్రామానికి చెందిన గంగా ధర్‌ జానపదంతో ప్రజలకు దగ్గరయ్యాడు. పుట్టిన ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ముథోల్‌లో ఇంటర్‌ పూర్తిచేశాడు.

ఆ సమయంలోనే ముథోల్‌లోని గ్రామ సంస్థలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతూ బతుకుదెరువు కోసం అదే జిల్లాలో ఉండిపోయాడు. ఆ సమయంలోనే శిక్షణ పొందిన గంగాధర్‌ జానపదంలో రాణించాడు. నవరసాల జానపదంతో పల్లె ప్రజలను ఆకట్టుకున్నాడు. 

నగర బాటలో గళం విప్పి...

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో నగర బాట కార్యక్రమాన్ని చేపట్టాడు. భైంసా పట్టణంలోనూ నిజామాబాద్‌లోనూ సీఎం చేపట్టిన నగర బాటలో గంగాధర్‌ జానపదాలు పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలపై గళం విప్పిన గంగాధర్‌కు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పటి నిజామాబాద్‌ కలెక్టర్‌ బీవీ రాయుడు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం జిల్లా కల్చరర్‌ కో ఆర్డినేటర్‌గా గంగాధర్‌ పనిచేస్తున్నాడు. 

ఊరిపేరే ఇంటి పేరుగా..

అబ్బోల్ల వీరి ఇంటిపేరు అయినప్పటికీ ఆ పేరుతో ఎవరూ గంగాధర్‌ను పిలువరు. పుట్టిపెరిగిన ఆష్టా గ్రామమే గంగాధర్‌కు ఇంటి పేరు అయ్యింది. ఇప్పటికీ ఎవరైనా ఆష్టా గంగాధర్‌ అనే ఈ కళాకారున్ని పిలుస్తారు. రేలారేరేలాలో రషీదు, గంగా, రాజేశ్, గోదావరి, పూజతోపాటు ఎంతో మందిని పరిచయం చేసింది ఆష్టా గంగాధరే.

ఎంతో మంది కళాకారులను శిక్షణ ఇచ్చి వేదికల్లో పరిచయం చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గజ్జెకట్టి జానపదం పాడిన గంగాధర్‌ను గోరేటి వెంకన్నతోపాటు ఎంతోమంది అభినందించారు. 

వివిధ దేశాల్లో ప్రదర్శనలు.. 

కాళ్లకు గజ్జెలు కట్టి పల్లె పుట్టుకను జానపదంతో వివరించే గంగాధర్‌ ఆష్టా గ్రామం నుంచి లండన్‌ వరకు వెళ్లగలుగుతున్నాడు. అక్టోబర్‌లో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు లండన్‌ రావాలంటూ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆష్టా గంగాధర్‌కు ఆహ్వానం కూడా అందింది. ఇప్పటివరకు దుబాయ్, మలేషియా, సింగపూర్‌ దేశాల్లోనూ నిర్వహించిన జానపద వేదికలపై ఈ కళాకారుడు పాల్గొని జానపదం వినిపించాడు.

అమ్మ ఆశీస్సులతోనే..

చదువుల తల్లి సరస్వతీ అమ్మ ఆశీస్సులు నాపై దండిగా ఉన్నాయి. అమ్మదయతో నేను ఆష్టా నుంచి లండన్‌వరకు వెళ్లగలుగుతున్నా. పల్లెపుట్టిన సమయంలో జానపదం పుట్టింది. ప్రజల జీవనశైలికి దగ్గరగా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే జానపదం. జానపదమే ప్రజలకు ప్రాణప్రదమైంది. జానపద కళాకారుడిగా అభిమానిస్తున్న శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జానపదం నాకు జీవనోపాధిని చూపింది.

నలుగురిలో గౌరవం పెంచింది. మున్ముందు ఎంతోమంది కళాకారులను పరిచయంచేసే గొప్ప అవకాశం నాకు సరస్వతీ అమ్మ కల్పించింది. స్వీయరచనలతో పాటలు రాసి రికార్డింగ్‌ కూడా చేశాను. నన్ను ఆదరిస్తున్న ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.

Advertisement

తప్పక చదవండి

Advertisement