
బాబు ఏజెంటు.. తెలంగాణ ద్రోహి: జగదీశ్‌రెడ్డి
బ్లాక్ మెయిల్ చేయడానికే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు.
రేవంత్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ మెయిల్ చేయడానికే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గువ్వల బాలరాజుతో కలిసి బుధవారం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రా ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఏజెంటుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ‘ఆంధ్రా ప్రయోజనాల కోసం తెలంగాణలో పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. దుష్ర్పచారానికి దిగుతున్నాడు.
ఆంధ్రా ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడు’ అని ధ్వజమెత్తారు. నిండు శాసనసభలో అసత్యాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా శాసనసభలో ఎలా మాట్లాడతాడని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హెరిటేజ్ పాలపై పరీక్షలు జరిపి, చట్టపరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. హెరిటేజ్ పాలలో విషపూరితమైన రసాయనాలున్నాయంటూ కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధించిందన్నారు. దీనిపై సభలో చర్చ జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడంలేదన్నారు. హెరిటేజ్‌లో రేవంత్ రెడ్డి కూడా భాగస్వామేనా అని మంత్రి ప్రశ్నించారు.