ఏం జరుగుతోంది..?!

IT Minister KTR Call To Jogu Ramanna On Cabinet Issue - Sakshi

జోగు రామన్న ఎపిసోడ్‌పై హైకమాండ్‌ ఆరా..

రంగంలోకి దిగిన కేటీఆర్

అజ్ఞాతం వీడిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే

అనారోగ్యంతోనే దూరంగా ఉన్నట్లు వెల్లడి

ఆదిలాబాద్‌లో పరిస్థితిపై నిఘా వర్గాల నివేదిక

సాక్షి, మంచిర్యాల: అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లోనే ప్రత్యక్షమైన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. కాగా టీఆర్‌ఎస్‌లో మంత్రులు, మాజీమంత్రులు అసంతృప్తి రాగం వినిపిస్తున్న క్రమంలో.. జోగు రామన్న వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగారు. జోగు రామన్నకు స్వయంగా ఫోన్‌ చేసి ఏం జరిగిందని తెలుసుకున్నట్లు సమాచారం. జోగు  రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఆదిలాబాద్‌ జిల్లాలో నెలకొన్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి.

అలకతో కూడిన అనారోగ్యం
మాజీమంత్రి జోగు రామన్న వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్‌ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే చాన్స్‌ దక్కింది. తొలిదఫా రాకున్నా..  విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. రెండు రోజుల క్రితం ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం వద్ద ఓ కార్యకర్త కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామన్నకు మంత్రి పదవి రాకపోవడానికి కారణమంటూ.. టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకులు ఇద్దరు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఫోన్‌ ఆన్‌ చేసిన రామన్న.. అనారోగ్యం కారణంగానే ‘దూరంగా’ ఉన్నానంటూ వివరణ ఇచ్చారు. ఇక రామన్న కుటుంబ సభ్యులు మాత్రం మంత్రి పదవి రాకపోవడంతోనే రక్తపోటు (బీపీ) పెరిగి అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు.


నిఘావర్గాల నివేదిక
మాజీమంత్రి రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అంతర్గత పరిస్థితి, ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, పార్టీ నాయకులు కొట్టుకోవడంతో పాటు, ఇతర నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించినట్లు తెలిసింది.

కేటీఆర్‌ ఫోన్‌..?
మంత్రి పదవి దక్కకపోవడంతో జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లాడనే వార్తల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగారు. స్వయంగా జోగు రామన్నకు ఫోన్‌ చేసినట్లు సమాచారం. తాము కూడా గులాబీ ఓనర్లమేనంటూ ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే క్రమంలో సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ కూడా ఈటల వ్యాఖ్యలను సమర్థించడం.. మంత్రివర్గ విస్తరణ తరువాత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం రాజయ్య ధిక్కార స్వరాన్ని వినిపించడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగు రామన్న కూడా అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లడంతో కేటీఆర్‌ ఆయనకు ఫోన్‌ చేసి భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top