ఇంకొన్నాళ్లు ఇంటి నుంచే పని!

IT Companies Still Interested In Work From Home In Hyderabad - Sakshi

‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ విధానానికే ఐటీ రంగం మొగ్గు

ఈ విధానంతో ఉత్పాదక సామర్థ్యం పెరిగింది

యువ ఇంజనీర్లు కొత్త టెక్నాలజీలపై దృష్టిపెట్టాలి

కొత్త ప్రాజెక్టుల రాకతో ఈ రంగానికి మంచి భవిష్యత్తు

‘సాక్షి’తో టిటా అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ మక్తాల

‘కరోనా సంక్షోభానికి ముందు నుంచే హైదరాబాద్‌ ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం అమల్లో ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో 95 శాతం మంది ఇంటి నుంచే పనిచేశారు. ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యం పెరగడంతో మరికొంత కాలం ఇదే విధానం కొనసాగించేందుకు ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారు ఎమర్జింగ్‌ టెక్నాలజీపై శిక్షణ పొందితే మంచిది’ అని తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ మక్తాల అన్నారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ ఐటీ రంగం స్థితిగతులపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
► కరోనాకు ముందు నుంచే హైదరాబాద్‌ ఐటీ రంగంలో 15 – 20 శాతం మందికి ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఉండేది. కరోనా సంక్షోభం తరువాత మార్చి రెండో వారం నుంచే మన దగ్గర చాలా ఐటీ కంపెనీలు ఈ విధానాన్ని అనుసరించాయి. దీంతో సుమారు 90 – 95 శాతం మంది లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచే పనిచేశారు. 
► ఒక్కసారిగా లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి రావడంతో.. కొందరికి లాప్‌టాప్‌లు, డాంగుల్స్‌ లేకపోవడం, బ్రాడ్‌బ్యాండ్‌ సమస్యల వంటివి తలెత్తాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, మారుమూల ప్రాంతాల నుంచి ఈ విధానంలో పనిచేయడంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. హైదరాబాద్‌ ఐటీ రంగం తనకున్న సామర్థ్యంతో దీన్నుంచి బయటపడింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం ద్వారా 90 శాతంగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యం 130 శాతం ఉన్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో కొన్ని కంపెనీలు జూలై వరకు, మరికొన్ని కంపెనీలు పరిస్థితి చక్కబడే వరకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ కొనసాగించవచ్చు. పర్యవేక్షణ, డేటా సెంటర్ల సిబ్బంది మినహా కోడర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉంది. 
► కరోనా సంక్షోభంతో చాలా ఐటీ కంపెనీలు క్యూబికల్స్‌ అద్దె, హౌస్‌ కీపింగ్, క్యాబ్‌లు, విద్యుత్‌ బిల్లులు తదితర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐటీ కంపెనీలు వ్యూహాలను మార్చు కుంటాయి. చైనాపై అమెరికాతో పాటు పలు దేశాలు ప్రతికూల ధోరణితో ఉండటం భారతీయ ఐటీ రంగానికి, ప్రత్యేకించి హైదరాబాద్‌కు మేలు చేస్తుంది. ఐటీ పెట్టుబడులతో పాటు కొత్త ప్రాజెక్టులొచ్చే అవకాశం ఉండటంతో ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. 
► ఐటీ రంగంలో శాశ్వత సిబ్బంది కాకుండా పెద్ద కంపెనీల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది ఎప్పుడూ బఫర్‌లో ఉంటారు. ప్రస్తుత సంక్షోభం అక్కడక్కడా వీరి ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చు. ఐటీ రంగంలో ఆరోగ్యం, ఇన్సూరెన్స్‌ వంటి రంగాల్లో (వెర్టికల్స్‌)లో పనిచేసే వారికి ఇబ్బంది లేకపోవచ్చు. అయితే కరోనా ఈ సంక్షోభ సమయంలోనూ వైద్య, ఆరోగ్య రంగాల్లో కొత్త అవకాశాలను తెచ్చిపెడుతోంది. 
► ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, బ్లాక్‌ చెయిన్‌ వంటి ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారు కూడా ఎమర్జింగ్‌ టెక్నాలజీపై దృష్టి పెడితే మంచి అవకాశాలుంటాయి. 
► కరోనా సంక్షోభ సమయంలో ‘టిటా’ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ‘కోవిడ్‌–19 హ్యాకథాన్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 8వేల మంది పాల్గొని సలహా సూచనలిచ్చారు. ‘టీ కన్సల్ట్‌’ యాప్‌ ద్వారా రోగులు, వైద్యులు ఆన్‌లైన్‌ విధానంలో సంప్రదింపులు జరిపే విధానానికి మంచి స్పందన వస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top