కనీస నీటి మట్టాలు తగ్గొద్దు!

Irrigation Department warns officials of projects - Sakshi

  ప్రాజెక్టుల అధికారులను హెచ్చరించిన నీటి పారుదల శాఖ 

  నిర్వహణలో విఫలమైతే ఈఈలపై సస్పెన్షన్‌ వేటు

    మిషన్‌ భగీరథ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో తీవ్ర నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో లభ్యత నీటిని జాగ్రత్తగా వినియోగించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. గతేడాది కనీస నీటి మట్టాల నిర్వహణలో వైఫల్యంతో తాగునీటికి కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది ఆ పరిస్థితులు పునరావృతం కావొద్దని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మిషన్‌ భగీరథ అవసరాల కోసం ఇప్పటికే ఏయే ప్రాజెక్టులో ఎంత కనీస నీటి మట్టాలు ఉండాలో స్పష్టం చేసిన నీటి పారుదల శాఖ, వాటి నిర్వహణలో విఫలమైతే సంబంధిత ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు (ఈఈ)లపై సస్పెన్షన్‌ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ శుక్రవారం అన్ని ప్రాజెక్టుల అధికారులకు సమాచారం పంపింది. 

ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల నిర్ధారణ 
మిషన్‌ భగీరథ కింద తాగు నీటి అవసరాలకు ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది మే నెల వరకు మొత్తంగా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించారు. దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్‌లోని 15 రిజర్వాయర్లు, గోదావరి బేసిన్‌లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను నిర్ధారించారు. సింగూరు ప్రాజెక్టు వాస్తవ నీటి మట్టం 523.60 మీటర్లయితే ఇక్కడ కనీస నీటి మట్టాన్ని 520.50 మీటర్లుగా నిర్ధారించారు. ఈ కనీస నీటి మట్టాన్ని నిర్వహిస్తేనే భగీరథ అవసరాల కింద 5.70 టీఎంసీల నీటిని ఏడాది పాటు తీసుకునే వీలుంది. అలాగే ఎల్లంపల్లి వాస్తవ నీటి మట్టం 148 మీటర్లు కాగా కనీస నీటి మట్టాన్ని 146.40గా నిర్ణయించారు. ఈ నీటి మట్టాన్ని నిర్వహిస్తేనే 2.82 టీఎంసీలను తాగునీటికి తీసుకునే అవకాశముంది. ఇలా అన్ని రిజర్వాయర్ల పరిధిలో కనీస నీటి మట్టాలపై ఇదివరకే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.  

కొన్ని చోట్ల దిగువకు నీరు.. 
కొన్ని చోట్ల నీటి లోటు కారణంగా ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు నీటి నిల్వలు చేరాయి. ముఖ్యంగా కల్వకుర్తి పరిధిలోని ఎల్లూర్‌ కింద 7.12 టీఎంసీల నీటి అవసరాలుండగా అక్కడ మట్టాలు తగ్గడంతో 0.50 టీఎంసీ కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల మిషన్‌ భగీరథ అవసరాలపై సమీక్షించిన సీఎం కేసీఆర్‌ తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఎస్‌కే జోషి నీటి పారుదల శాఖకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కనీస నీటి మట్టాలకు దిగువన నీటిని విడుదల చేయరాదని ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు పంపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే కచ్చితంగా ప్రాజెక్టుల అధికారులు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఎక్కడైనా కనీస నీటి మట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంబంధిత ఈఈలను సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటే పెనాల్టీ సైతం విధిస్తామని పేర్కొంది. మిషన్‌ భగీరథకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఈ ఆదేశాలను పాటించేలా అన్ని ప్రాజెక్టుల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top