అక్రమాలతో ‘అనుబంధం’

Irregularities In Intermediate Board Office - Sakshi

ఇంటర్మీడియట్‌ బోర్డులో మరో అవినీతి బాగోతం

ఏటా లోపాలంటూ కాలేజీలకు నోటీసులు.. ముడుపులు

ముట్టగానే అనుబంధ గుర్తింపు

గతేడాది అంతే.. ఈసారి అలాగే

ముడుపులిస్తేనే అనుమతులు ఇస్తామంటూ పరోక్ష సంకేతం

‘గుర్తింపు’ ఇవ్వకుండానే ప్రవేశాలు

1,636 ప్రైవేట్‌ కాలేజీల్లో 100 కాలేజీలకైనా ఇవ్వని గుర్తింపు

ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి  అశోక్‌పై ఆరోపణలు

ఏం చేయాలి... 

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు కోసం జనవరిలో ఇంటర్‌బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తులను స్వీకరించిన తరువాత ఫిబ్రవరి నుంచే అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టాలి. ఆ తరువాత మే నెలలో విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి. గుర్తింపు ఉంటేనే విద్యార్థులను చేర్చుకోవాలి.

 ఏం చేస్తున్నారు..

మే ముగుస్తున్నా ఇంటర్‌ బోర్డు కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. ముడుపుల కోసమే జాప్యం చేస్తూ కాలేజీలను బోర్డు చుట్టూ తిప్పుకుంటున్నట్లు తెలిసింది. అధికారుల పరోక్ష ఆమోదంతో ‘గుర్తింపు’లేని కాలేజీలు కూడా విద్యార్థులను చేర్చుకున్నాయి. అంతా అయ్యాక విద్యార్థుల భవిష్యత్‌ పేరిట లంచాలు తీసుకుని ఓకే చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీల అనుబంధ గుర్తింపులో అక్రమాల దందా మళ్లీ మొదలైంది. ఇప్పటికే అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్‌ బోర్డు ఇప్పుడు మరో అవినీతి బాగోతానికి వేదికగా మారింది. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకుండానే ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేసి, ఇప్పుడు అనుబంధ గుర్తింపు లేదంటూ కొందరు అధికారులే కార్పొరేట్‌ కాలేజీల వారీగా వసూళ్ల కోసం రేట్‌ ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది.

ఇప్పటికే కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థులను ఎలాగూ చేర్చుకున్నాయి కాబట్టి వారి భవిష్యత్‌ పేరుతో.. ముడుపులు ముట్టజెప్పిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామంటూ పరోక్షంగా సంకేతాలు పంపించారు. గతేడాది కూడా ఇదే దందా సాగించిన బోర్డులోని కీలక అధికారులు ఇప్పుడు మళ్లీ వసూళ్లకు దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కార్పొరేట్‌ కాలేజీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆమోదంతోనే కొందరు జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో కీలక సిబ్బంది వసూళ్ల దందాకు తెరతీసినట్లు తెలిసింది. 

జనవరిలోనే దరఖాస్తులు తీసుకున్నా... 
రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు 2019–20 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం జనవరి 5న ఇంటర్‌బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో మార్చి 20 వరకు దరఖాస్తులను తీసుకుంది. ఈ లెక్కన ఫిబ్రవరి నుంచే అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నా ఇంతవరకు పూర్తి చేయలేదు. ముడుపుల కోసమే జాప్యం చేస్తూ కాలేజీలను బోర్డు తిప్పుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 2,500కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఉంటే అందులో 1,636 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుంటే అందులో 301 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చింది. మరో 103 కాలేజీలు జియో ట్యాగింగ్‌కు అవసరమైన ఫొటోలను అప్‌లోడ్‌ చేయనందున వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈనెల 25న ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వెంటనే ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. అలాగే 564 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో 545 కాలేజీలకు అనుబంద గుర్తింపును ఇచ్చింది. మిగతా 1,636 ప్రైవేటు కాలేజీల్లో 100 కాలేజీలకు ఇంతవరకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. 

దారికి తెచ్చుకునేందుకు ముందుగా నిరాకరణ.. 
కాలేజీలను తమ దారికి తెచ్చుకునేందుకు నిర్ధేశిత పత్రాలు లేవంటూ గుర్తింపును నిరాకరిస్తున్నారు. కాలేజీల లీజ్‌ అగ్రిమెంట్, యాజమాన్య మార్పు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్, శానిటేషన్, భవన నిర్మాణ అనుమతులు, కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా కాలేజీలకు గుర్తింపు ఇవ్వడం లేదు. దీంతో విసిగిపోయిన కొన్ని యాజమాన్యాలు ముడుపులు ముట్టజెప్పేందుకు ఓకే చెప్పగానే అనుబంధ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిసింది.  

భారీ మొత్తం వసూళ్ల కోసం..? 
సాధారణ కాలేజీల్లో వసూళ్లతోపాటు పది యాజమాన్యాలకు చెందిన టాప్, కార్పొరేట్‌ కాలేజీల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దాదాపు అన్నింటికి అనుబంధ గుర్తింపును నిలిపి వేసి, దీనికి కారణాలను చూపే పనిలో పడినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 250 వరకు ఉన్న కార్పొరేట్‌ కాలేజీలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. దీని కోసం బోర్డులోని కీలక అధికారి ఒకరు స్కెచ్‌ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కూడా ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. గతేడాది కార్పొరేట్‌ విద్యా సంస్థలకు చెందిన 66 కాలేజీల వ్యవహారంలోనూ ఇలాగే చేసినట్లు సమాచారం. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్‌ పేరుతో అనుబంధ గుర్తింపు ఇవ్వకపోయినా పరీక్షలకు అనుమతించారు.

ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో వసూలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ సారీ ఇదే తరహాలో వసూళ్లకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 21నే బోర్డు మొదటి దశ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 31లోగా మొదటి దశ ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. బోర్డు అధికారుల పరోక్ష ఆమోదంతో ‘గుర్తింపు’లేని కాలేజీలు కూడా ఇప్పటికే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఇంకేముంది యాజమాన్యాలతో కుమ్మక్కు అయిన బోర్డు అధికారులు తమ వసూళ్ల దందాలో మళ్లీ ‘విద్యార్థుల భవిష్యత్‌’అంటూ వాటిని కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. బేరసారాలు పూర్తయ్యాక మిగతా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top