సాహసానికి దక్కని గుర్తింపు!

Iqbal Shareef Waiting For Pramotion And Gold Medal - Sakshi

1993లో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోదుండగుల దాడి  

72 మంది ప్రయాణికులను కాపాడినఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఇక్బాల్‌ షరీఫ్‌  

ప్రమోషన్, బంగారు పతకంఅందజేస్తామని అప్పటి రైల్వే ఐజీ హామీ

ఇప్పటికీ నెరవేరని వైనం  

సాక్షి, సిటీబ్యూరో: అది 1993 జనవరి 13. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘట్‌కేసర్‌ చేరుకుంది. అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు ఎస్‌–9 బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు. ఆరుగురు గాయపడ్డారు. మిగతా ప్రయాణికులు భయాందోళనతో అరుస్తున్నారు. అందులో పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్‌ షరీఫ్‌ వెంటనే అక్కడికి వెళ్లాడు. దుండగులు ఇక్బాల్‌పై కత్తులతో దాడి చేశారు. తల, శరీరభాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నాడు ఇక్బాల్‌. ప్రాణాలకు తెగించి ఎంతో సాహసంతో బోగీలోని 72 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఇది జరిగి 25 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ ఇక్బాల్‌ సాహసానికి గుర్తింపు దక్కలేదు.

ఇప్పటికైనా న్యాయం చేయండి..  
ఆదిలాబాద్‌ రిజర్వ్‌ పోలీస్‌ విభాగంలో విధులు నిర్వహించిన ఇక్బాల్‌ను 25 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని రైల్వే పోలీస్‌ శాఖకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. 1993లో జరిగిన రైల్వే ఘటనలో అతడి సాహసానికి మెచ్చి ప్రమోషన్‌తో పాటు బంగారు పతకం అందజేస్తామని అప్పటి రైల్వే ఐజీ సీహెచ్‌ కోటేశ్వర్‌రావు, డీజీపీ హామీ ఇచ్చారు. అయితే ఇది ఇప్పటికీ నెరవేరలేదు. అటు పోలీస్‌ శాఖ నుంచి గానీ, ఇటు రైల్వే శాఖ నుంచి గానీ ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. దీనిపై 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, తన రిటైర్‌మెంట్‌ కూడా దగ్గరపడుతోందని ఇక్బాల్‌ ‘సాక్షి’తో తన ఆవేదన చెప్పాడు. సీఎం, హోంమంత్రి, పోలీస్‌ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తన సేవలను గుర్తించి, న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తన సర్వీస్‌లో ఇప్పటి వరకు 20 క్యాష్‌ అవార్డులు, 20 గుడ్‌ సర్వీస్‌ ఎంటీ (జీఎస్‌ఈ) పతకాలు సాధించానన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top