కాంగ్రెస్‌లో  ఆధిపత్య పోరు

Internal Differences In Congress Nizamabad - Sakshi

ఇన్‌చార్జీలను కాదని కొత్త వ్యక్తులు తెరపైకి..

కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు

అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: పార్టీ బలోపేతం పేరుతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ము గ్గురు నాయకులను పార్టీ సీనియర్లు ప్రోత్సహిస్తుండడం పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగాదాలకు ఆజ్యం పోసినట్లవుతోంది. నియోజకవర్గానికి ఓ ఇన్‌చార్జి కొనసాగుతున్నప్పటికీ.. మరో వ్యక్తిని తెరపైకి తేవడం స్థానికంగా ఆధిపత్య పోరుకు దారి తీస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు  నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొంది. ఇలా కొత్త నేతలను తెరపైకి తెస్తున్న ఒకరిద్దరు సీనియర్‌ నేతలు ఆయా నియోజకవర్గాల్లో తలెత్తుతున్న సమన్వయ లోపాన్ని కావాలనే సరిదిద్దడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
 
బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా కాసుల బాల్‌రాజ్‌ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై పోటీ చేశారు. ఇక్కడ కొత్తగా మరోనేత మల్యాద్రిరెడ్డిని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెరపైకి తేవడంతో స్థానికంగా గ్రూపు తగాదాలకు దారితీసినట్లయింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి నాయకత్వం అవసరం కాగా, ఉన్న కాస్త క్యాడర్‌ గ్రూపులుగా విడిపోవడంతో పార్టీకి నష్టం వాటిల్లుతోంది.
 
ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో నల్లమడుగు సురేందర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఇక్కడ జమునా రాథోడ్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిలు తెరపైకి వచ్చారు. దీంతో నల్లమడుగు సురేందర్‌ను అభద్రతాభావానికి గురి చేసినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ బరిలోకి దిగారు. ప్రస్తుతానికి ఆయన ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యహరిస్తున్నారు. కానీ ఇక్కడ నరాల రత్నాకర్‌ను ఓ సీనియర్‌ నేత కావాలనే ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇది నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య గ్రూపుల గొడవలకు దారితీస్తోందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇటీవల శ్రీనివాసకృష్ణన్‌ జిల్లాకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఓ వర్గం పూర్తిగా దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల కిత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన బస్సుయాత్ర సందర్భంగా గ్రూపు విబేధాలు బహిరంగసభ వేదికపైనే బహిర్గతమయ్యాయి.
 
జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కొత్తగా మదన్‌మోహన్‌రావును తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సురేశ్‌షెట్కార్‌ పోటీ చేశారు. ఈసారి కొత్తగా మదన్‌మోహన్‌రావును పార్టీలో చేర్పించడంతో పాత, కొత్త నాయకుల మధ్య దూరం పెరిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమను పక్కనబెట్టి కొత్త వారికి ప్రాధాన్యత కల్పిస్తుండడంతో పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పార్టీలో ఉన్న సీనియర్‌ నేతలు సమన్వయం కుదిర్చేలా వ్యవహరించాల్సింది పోయి.. గ్రూపు విభేదాలకు ఆజ్యం పోసేలా పరోక్షంగా పావులు కదుపుతున్నారనే విమర్శలున్నాయి.

ఓ సీనియర్‌ నేతపై ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ఆ పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాస్‌ కృష్ణన్‌కు, ఆర్‌సీ కుంతియాను కలిసి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే జిల్లాలో మరోమారు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top