‘వొకేషనల్‌’.. ఇక ప్రొఫెషనల్‌

Intermediate Education Department Launches Exercise In Vocational Intermediate Courses In The State - Sakshi

స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు

సెంచూరియన్‌ వర్సిటీలో ఇంటర్‌ విద్యా శాఖ అధ్యయనం

ప్రస్తుతమున్న 22 రకాల కోర్సుల్లో కొన్ని రద్దు చేసే యోచన

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ

ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌:
►కాఫీ ఇష్టపడే వారు ఎక్కువే. అలాంటి కాఫీ ప్రి యుల కోసం 42 రకాల కాఫీలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. ఆర్థిక స్థోమత లేక ఇంటర్మీడి యట్‌ పూర్తికాగానే ఏదో ఉద్యోగమో.. ఉపాధో పొందాలనుకునే వారు కాఫీ మేకింగ్‌ కోర్సు చదివితే.. ఓ కాఫీ షాప్‌ పెట్టుకోవచ్చు. 
►బేకరీ, ఫ్లవర్‌ బోకే మేకింగ్‌.. ఇవీ అంతే. వీటి తయారీలో శిక్షణ పొందడం ద్వారా ఆయా రంగాల్లో స్థిర పడవచ్చు. 
►తాజా ట్రెండ్‌ డ్యూటీ కేర్‌ మేనేజ్‌మెంట్‌. ఉద్యో గులైన భార్యాభర్తలు ఇంట్లో ఉండే తమ వృద్ధు లైన తల్లిదండ్రులను చూసుకునే వారి కోసం వెంపర్లాడుతున్నారు. వేలు చెల్లించి నర్సులను నియమించుకుంటున్నారు. అలా సేవలందించాలనుకునే వారి కోసం వచ్చిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డిమాండ్‌ ఉంది.

ఇంకా.. ఆటోమొబైల్‌ సర్వీసింగ్, మోటారు వైండింగ్‌ కమ్‌ ఎలక్ట్రీషియన్, కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ, టాయ్స్‌ మేకింగ్, అర్బన్‌ మైక్రో బిజినెస్, సోలార్‌ ఎనర్జీ వంటి కోర్సులను రాష్ట్రంలోని వొకేషనల్‌ ఇంటర్మీడియట్‌లో కోర్సులుగా అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్మీయట్‌ విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు  సమూల సంస్కరణలకు ఇంటర్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ శ్రీకారం చుట్టారు. వొకేషనల్‌ కోర్సు చేసే విద్యార్థి ఉద్యోగంలో లేదా సొంతంగా ఉపాధి పొందేలా ఉండాలన్న లక్ష్యంతో ఈ కోర్సులను మార్చనున్నారు.

సెంచూరియన్‌ వర్సిటీలో అధ్యయనం.. 
రాష్ట్రంలోని వొకేషనల్‌ విద్యలో మార్పులు తేవాల ని నిర్ణయించిన ఇంటర్‌ బోర్డు.. ఇలాంటి వొకేషనల్‌ కోర్సులను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఒడిశాలోని సెంచూరియన్‌ వర్సిటీలో అధ్యయ నం చేసింది. అక్కడ అమలు చేస్తున్న కోర్సులు, వాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్, విద్యార్థులకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నివేదిక సిద్ధం చేస్తోంది. ఉన్నతాధికారుల బృందం ఈ నెల 7న ఆ వర్సిటీలో అధ్యయనం చేసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని వీలైతే వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సుల్లో సమూల మార్పులను, కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

ప్రాంతాన్ని బట్టి కోర్సులు.. 
కాఫీ మేకింగ్, బేకరీ మేకింగ్, ఫ్లవర్‌ బొకే మేకింగ్‌ వంటి కోర్సులకు, పనులకు పట్టణ ప్రాంతాల్లోనే డిమాండ్‌ ఉంటుంది. వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారీ, మష్రూమ్‌ కల్చర్, మోటార్‌ వైండింగ్‌ కమ్‌ ఎలక్ట్రీషియన్‌ వర్క్‌ వంటి కోర్సులకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. అక్కడే వాటి అవసరం ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందో అక్కడ వాటిని నిర్వహించేలా ఇంటర్‌ విద్యా శాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిమాండ్‌ లేని కొన్ని కోర్సులను తొలగించే అంశాలను పరిశీలిస్తోంది. ప్రాంతాన్ని బట్టి డిమాండ్‌ ఉన్న కోర్సులను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 రకాల కోర్సులు ఉండగా, అందులో కొన్నింటిని తొలగించి 15 రకాల కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది.

కనీసంగా 2 లక్షలకు పెంచేలా.. 
రాష్ట్రంలో 176 ప్రభుత్వ, 401 ప్రైవేటు వొకేషనల్‌ జూనియర్‌ కాలేజిల్లో 96,208 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ సంఖ్యను కనీసంగా 2 లక్షలకు పెంచాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ పెట్టుకుంది. కోర్సు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగ/ఉపాధి లభించే కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top