
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు, సెకండియర్ పరీక్షలను మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం షెడ్యూల్‌ను జారీ చేశారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష అదే నెల 31న ఉంటుందని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. జనరల్‌తోపాటు వొకేషనల్ విద్యార్థులకు ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని తెలిపారు. మొదటి రోజు ద్వితీయ భాషా సబ్జెక్టుతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
త్వరలోనే టెన్త్ పరీక్షల షెడ్యూలు..
పదో తరగతి పరీక్షల షెడ్యూలు ఖరారుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 12 లేదా 14వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. ఏటా ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం. ఈసారి నుంచి ఏప్రిల్ 12వ తేదీని చివరి పనిదినంగా ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 9 వరకు ప్రీఫైనల్ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12 లేదా 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.