మా పొట్ట కొట్టకండి

Innovative Protest of RTC Employees in Tandoor - Sakshi

తాత్కాలిక ఉద్యోగులను వేడుకున్న ఆర్టీసీ కార్మికులు 

గులాబీ పువ్వు ఇచ్చి మద్దతు తెలపాలని వినతి 

తాండూరు టౌన్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులమంతా సమ్మె చేస్తుండగా, తాత్కాలిక ఉద్యోగులుగా చేరి మా పొట్ట కొట్టకండని ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్న విషయం విదితమే. 18వ రోజుకు చేరిన సమ్మెలో భాగంగా మంగళవారం ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి వద్దకు వెళ్లి వారికి గులాబీ పువ్వులను అందించారు. ఆర్టీసి బలోపేతానికి, ఉద్యోగ భద్రతకు, ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం సమ్మె చేస్తున్నామని, దీనికి విరుద్ధంగా మీ స్వలాభం కోసం విధులకు హాజరవుతూ మా పొట్టలు కొట్టొద్దని వేడుకున్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితే కొత్త నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. మీరంతా శాశ్వత ఉద్యోగులుగా మారొచ్చని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే తాత్కాలిక ఉద్యోగులను తీసుకుందన్నారు.కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం మానేయాలని, ఇకనైనా హైకోర్టు ఆదేశాలను శిరసావహించి కార్మిక సంఘాల జేఏసీ నేతలను చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీజేఎస్‌ నేత సోమశేఖర్, టీజేఎంయూ డిపో గౌరవాధ్యక్షుడు పటేల్‌ విజయ్, బీజేపీ నేతలు కృష్ణముదిరాజ్, భద్రేశ్వర్, సీపీఎం నేత శ్రీనివాస్, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అంజిలయ్య, గోపాల్, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top