గాయపడిన పులి జాడేది..? | Injured Tiger Missing in Adilabad | Sakshi
Sakshi News home page

గాయపడిన పులి జాడేది..?

Jun 17 2020 12:16 PM | Updated on Jun 17 2020 12:16 PM

Injured Tiger Missing in Adilabad - Sakshi

గాయంతో ఉన్న కే–4 పులి (ఫైల్‌)

చెన్నూర్‌: చెన్నూర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో గత నాలుగేళ్ల క్రితం వేటగాళ్లు అమర్చిన ఉచ్చు కే–4 పులి నడుముకు చుట్టుకున్న విషయం తెలిసిందే. పులి నడుముకు ఉచ్చు బిగిసి గాయంతోనే పులి అటవీ ప్రాంతంలో సంచరించింది. ఈ పులిని పట్టుకొని వైద్యం చేసేందుకు ఫారెస్ట్‌ అధికారులు గత ఏడాది ప్రయత్నించారు. పులి చిక్కకపోవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. గత ఏడాది కాలంగా చెన్నూర్, నిల్వాయి, బెల్లంపల్లి అటవీ ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన పులులు సంచరిస్తున్నట్లు ఆయా మండలాల ఫారెస్ట్‌ అధికారులు సైతం ప్రకటించారు. గాయపడిన కే–4 పులి సంచరించిన విషయం వెలుగులోకి రాలేదు. అయితే గాయపడిన పులి ఆరోగ్యంగా ఉందా..? మృతి చెందిందా..? అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పులి సురక్షితంగానే ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.

హడలెత్తిస్తోన్న పులులు..
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి పులుల సంచారం పెరిగింది. పులుల సంరక్షణ పట్ల వైల్డ్‌లైఫ్, ఫారెస్ట్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంచిర్యాల జిల్లా మీదుగా కుమురం భీం జిల్లా వరకు సుమారు పదికి పైగా పులులు సంచరిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అయితే మంచిర్యాల జిల్లాలోని ఏదో ఒక మండలంలో పులులు సంచారిస్తూ హడలెత్తిస్తున్నాయి. రోజుకో మండలంలో పులి దర్శనమివ్వడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పులుల సంచార విషయాన్ని తెలుసుకుంటున్న అధికారులు ఆయా గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పెరిగిన పులుల సంతతి
మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో పులుల సంతతి పెరిగింది. కుమురం భీం జిల్లాలో ఉన్న ఫాల్గుణ అనే పులి గత రెండేళ్ల క్రితం నాలుగు పులి పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం మరో మూడు పిల్లలకు జన్మనిచ్చినట్లు గుర్తించిన అధికారులు తాజాగా మరో పులి పిల్లను గుర్తించామని అంటున్నారు. మొత్తం ఎనిమిది పులి పిల్లలు, ఫాల్గుణ కాకుండా మరో మరో 9 పులులు రెండు జిల్లాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పెరిగిన పులుల సంతతి సంరక్షణ కోసం ఫారెస్ట్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

కే–4 పులి సురక్షితంగా ఉంది
పులుల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. పులుల రక్షణ కోసం ఎనిమల్‌ ట్రాకర్స్‌తో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. గతంలో కంటే ప్రస్తుతం జిల్లాలో పులుల సంచారం పెరిగిన మాట వాస్తవమే. గాయపడిన కే–4కు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. గాయపడిన పులి అటవీ ప్రాంతంలో సురక్షితంగానే ఉంది.–మధుసూదన్, ఎఫ్‌ఆర్వో, చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement