
పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న లావణ్య
వేమనపల్లి: గతుకుల రోడ్లు.. స్థానికంగా ఉండని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి గర్భశోకం మిగిలింది. పురిటి నొప్పులతో అడవిలోనే మృతశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోమాస లావణ్యకు శనివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. మొదటి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అయితే.. సిబ్బంది అందుబాటులో లేని కారణంగా రాలేమని చెప్పారు. దీంతో గ్రామంలోని ఆశవర్కర్ సరస్వతీ, ఆర్‌ఎంపీ సహాయం తీసుకున్నారు. పక్క గ్రామం జిల్లెడలో ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఎన్నడూ ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది గానీ స్థానికంగా ఉండరు.
ఇటీవల ప్రైవేటు ఆస్పత్రిలో లావణ్య స్కానింగ్ పరీక్ష చేయించుకోగా.. పాప ఎదురుకాళ్లతో జన్మించే అవకాశం ఉందని వైద్యులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం పాప అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వైద్యుడు, హెల్త్ సూపర్‌వైజర్, ఏఎన్‌ఎం పర్యవేక్షణ అవసరం కానీ.. ఎవరూ అందుబాటులో లేరు. ఇంటి వద్ద సాధారణ ప్రసవం కాకపోవడంతో చేసేదేమీ లేక ఆటోలో వేమనపల్లి పీహెచ్‌సీకి బయల్దేరారు. మార్గమధ్యంలోని నాగారం గ్రామం నుంచి మంగనపల్లి వరకు అటవీమార్గం మట్టిరోడ్డు గుంతలమయంగా ఉంది. గతుకులతో ఉన్న మట్టి రోడ్డులో కుదుపులే ప్రమాదకరంగా మారాయి. నాగారం అటవీ ప్రాంతంలోనే రాళ్లకుప్ప వద్దకు రాగానే నొప్పులు తీవ్రమయ్యాయి. అక్కడే లావణ్య మగ మృతశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం బాలింతను వేమనపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.