16 ఏండ్లకు శవమై వస్తుండు..

Indian Man  Died In Gulf - Sakshi

కంపెనీ వీసా మీద పోయి.. ఖల్లివెల్లిగా మారి..

కాయకష్టం చేసుకుంటూ ఎడారి దేశంలోనే ఉంటూ

చివరకు గల్ఫ్‌లోనే  ‘అనామకుడి’గా తనువు చాలించి..

గల్ఫ్‌లో మృతిచెందిన  మాదాపూర్‌వాసి రాజేశ్వర్‌

సాక్షి, నిర్మల్‌: ‘చేసేతందుకు ఇడ ఏం పనుందే. దేశం పోతే తిండికితిండి..నెలకిన్ని పైసలస్తయ్‌. ఊళ్లే మస్తుమంది పోయిండ్రు. ఇడ ఉండి కూడ ఏంజేయాల..’ అనుకుంటూ 16ఏళ్ల కిందట ఎడారి దేశం వెళ్లాడు. అప్పటినుంచి కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా మళ్లీ స్వదేశానికి రాలేదు. ఎప్పుడో యాదికొచ్చినప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసేవాడు. అది కూడా రెండుమూడు మాటలే మాట్లాడేవాడు. ‘ఇంటికాడ అంత మంచిదేనా..? అందరు మంచిగున్నరా..? నేను ఇడ మంచిగనే ఉన్న..’ ఎప్పుడు ఫోన్‌ చేసినా ఈ ముచ్చట్లే చెప్పేవాడు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా చెప్పేందుకు ఆయన లేడు

ఉన్న ఊరిని, కన్నవారిని కాదనుకుని దేశం కాని దేశంలో ఏళ్లుగా ఉంటున్న ఆయన అక్కడ ఓ అనామకుడిగా తనువు చాలించాడు. ‘గాలి మోటార్ల ఎగురుకుంటపోయినోడు ఎప్పటికైనా ఇంటికి రాకుంటే యాడికిపోతడు. వాడే అస్తడు..’ అని అనుకుంటున్న ఆ కుటుంబానికి ఇన్నేళ్లకు శవపేటికలో భద్రమై.. విగతజీవిలా వస్తున్నాడు. 16ఏళ్లుగా ఇంటికి రాకుండా ఎడారిదేశంలోనే ఉండి, చివరకు అక్కడే తుదిశ్వాస విడిచాడు.. నిర్మల్‌ జిల్లా సోన్‌మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన కొత్తగంటి రాజేశ్వర్‌(47). ఏళ్లుగా అక్కడే ఉండటంతో చివరకు ఆయన స్వస్థలం, కుటుంబం వివరాలు తెలుసుకోవడం కూడా కష్టమైంది. 

బతుకు దెరువు కోసం..
ఊళ్లో తెలిసిన వాళ్లందరూ వెళ్తుంటే రాజేశ్వర్‌  కూడా బతుకుదెరువు కోసం యుఏఈలోని అబుదా బికి వెళ్లాడు. అలా 16 ఏళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లిన రాజేశ్వర్‌కు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉన్నా.. ప్రస్తుతం తనకంటూ భార్యాపిల్లలు ఎవరూ లేరు. దీంతో ఇప్పటివరకు స్వగ్రామానికి రాలేదు. 2003 లో అబుదాబిలోని అల్‌జాబర్‌ అనే కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తర్వాత కంపెనీలో వేతన సమస్య తలెత్తడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ’ఖల్లివెల్లి’ (అక్రమనివాసి)గా జీవనం సాగించాడు. యూఏఈలో 2013, 2018 లలో ప్రకటించిన క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) పథకాలలోనూ రాజేశ్వర్‌ స్వదేశానికి రావడానికి ఇష్టపడలేదు. అక్కడే దొరికిన పనిచేసుకుంటూ జీవనం సాగించాడు.

అక్కడే అనారోగ్యంతో..
కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న రాజేశ్వర్‌ ఇటీవల గల్ఫ్‌లోనే తుదిశ్వాస వదిలాడు. ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్లిన ఆయన  వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. తన జేబులో ‘రాజేశ్వర్‌ కొత్తగాని, కొత్తగాని లింగన్న’ మాదాపూర్‌ అని ఇంగ్లిష్, అరబిక్‌ బాషలలో ఉన్న ఒక జిరాక్స్‌ పేపర్‌ మాత్రమే అక్కడి వారికి లభించింది. అక్కడి ఆసుపత్రి మార్చురీ (శవాగారం) విభాగం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎంతకూ ఆయన వివరాలేవి తెలియకపోవడంతో ఈ విషయాన్ని దుబాయిలోని ఒక భారతీయ సామాజిక సేవకుడికి తెలిపారు. ఆయన రాజేశ్వర్‌ చిరునామా తెలుసుకోవడం కోసం హైదరాబాద్‌లోని ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి సహాయం కోరారు. ఇక అప్పటినుంచి స్వదేశంలో రాజేశ్వర్‌ చిరునామా తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు.

మాదాపూర్‌లెన్నో ఉన్నయ్‌..
గల్ఫ్‌లో చనిపోయిన కొత్తగంటి రాజేశ్వర్‌ జేబులో దొరికిన లెటర్‌లో కేవలం ‘మాదాపూర్‌’ అని మాత్రమే ఉండటం జఠిలంగా మారింది. ఎందుకంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాలలో మాదాపూర్‌ పేరుతో చాలా ఊళ్లు ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో, నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్, జక్రాన్‌పల్లి మండలాల్లో, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, తలమడుగు, నేరేడిగొండ మండలాల్లో, నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో ఇదే పేరుతో గ్రామాలున్నాయి. ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం సమన్వయకర్తలు మాదాపూర్‌ పేరు గల ఈ ఏడు గ్రామాలలో ఆరా తీయడం మొదలు పెట్టారు. చివరకు నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం మాదాపూర్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఇదే విషయాన్ని ఎంబసీకి తెలిపారు. ఇక్కడి వరకు చేసిన ప్రయత్నానికి మరో అడ్డంకి ఎదురైంది. రాజేశ్వర్‌కు సంబంధించి పాస్‌పోర్ట్‌ తదితర గుర్తింపు పత్రాలు లేనందున శవాన్ని స్వగ్రామానికి తరలించే ప్రక్రియ ముందుకు సాగలేదు. 

ఆధారాలు లేక ఆలస్యం.. 
అబుదాబిలో చనిపోయిన రాజేశ్వర్‌ ఊరుపేరు తెలిసినా.. ఆయన ‘భారతీయుడు’ అనేందుకు ఆధారాలు సేకరించి పంపడం పెద్దసవాలుగా మారింది. ఆయన 16ఏళ్లుగా స్వదేశంలో లేనందున రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. రాజేశ్వర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయినప్పటికీ పిల్లలు కలుగలేదు. దీంతో భార్యలు విడాకులు తీసుకున్నారు. రాజేశ్వర్‌తో పాటు నలుగురు అన్నదమ్ములున్నారు. సోదరుల్లో ఒకరైన గంగన్న ఓ కేసులో ఓమన్‌ దేశంలోని మస్కట్‌ జైల్లో మగ్గుతుండగా,, మరొక సోదరుడు తక్కన్న కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

మరో సోదరుడు శ్రీనివాస్‌ మాదాపూర్‌లో తల్లిదండ్రులను చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు లక్ష్మి, లింగన్నల పాతరేషన్‌ కార్డు ఆధారంగా ఇండియన్‌ ఎంబసీ రాజేశ్వర్‌ను ’భారతీయుడి’ గా గుర్తించింది. ‘ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌–ఇసి’(ఔట్‌ పాస్‌ అనే తెల్లరంగు తాత్కాలిక పాస్‌పోర్ట్‌) జారీ చేసింది. దీంతో రాజేశ్వర్‌ మృతదేహం కలిగిన శవపేటిక శనివారం స్వగ్రామానికి చేరుకోనుంది. ఈ మొత్తం ప్రక్రియలో గల్ఫ్‌ బాధితులకు ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి  చాలా చొరవ తీసుకున్నారు.

పోయిన్నుంచి రాలే..
ఉపాధి కోసమని పోయిన అన్న పదహారేండ్లయినా ఇంటికి రాలేదు. ఎప్పుడన్న ఒక్కసారి ఫోన్‌ చేస్తుండే. రెండుమూడు మాటలు మాట్లాడి పెట్టేస్తుండే. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని చెప్పిండు. ఎప్పుడు ఇంటికి రమ్మని అడిగినా.. ఇడ బాగానే ఉన్న అంటుండే.
– శ్రీనివాస్, రాజేశ్వర్‌ సోదరుడు, మాదాపూర్‌     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top