మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పది

Indian family system is greatest in the world says Raghavendra Singh Chauhan - Sakshi

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ 

పిల్లలు సేవాగుణాన్ని అలవరచుకోవాలి

హైదరాబాద్‌: భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌(తాత్కాలిక) రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అన్నారు. దోమలగూడ రామకృష్ణమఠంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించే బాలసంస్కార్‌– 2019 శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్‌ జస్టిస్‌ చౌçహాన్‌ జ్యోతి వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల సంస్కార్‌లో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ నుంచి వచ్చాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్లాలి అనే మాటలను మనిషి అర్థం చేసుకుంటే జీవిత పరమార్థం తెలుస్తుందన్నారు.

దేశంలో ఇంకా కొనసాగుతున్న ఆంగ్లేయుల గులామితత్వం పోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లకు, కార్టూన్‌ ప్రోగ్రాంలకు అలవాటుపడకుండా చూడాలన్నారు. రామాయణం, భారతం, నీతికథలు చదివేలా ప్రోత్సహించాలని, అప్పుడే వారిలో జ్ఞానం,విలువలు పెరుగుతాయని చెప్పారు. మొఘలాయిలు, ఆంగ్లేయులు ప్రపంచంలోని అనేక దేశాలను ఆక్రమించి ఆయా దేశాల చరిత్రను, సంస్కృతిని నాశనం చేసినా భారత దేశ నాగరికతను, సంస్కృతి, సంప్రదాయాలను ఏం చేయలేక పోయారన్నారు. దేవుళ్లకు అభిషేకాల పేరుతో పాలు, ఆహార పదార్థాలను వృథా చేయకుండా మురికివాడల్లోని పేదలకు, ఆస్పత్రుల్లోని రోగులకు అందించే సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు.

ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తించినట్లే మనిషి కూడా తన ధర్మాన్ని నిర్వహించాలని, ప్రతి వ్యక్తిలోనూ క్రమశిక్షణ, పరోపకారం ముఖ్యమన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు వివాహం జరిగిన ఏడాది, రెండేళ్ల లోపే విడాకుల కోసం కోర్టులకు వస్తున్నారని, నిరుపేద, మధ్యతరగతి వారు మాత్రం గొడవల్లేకుండా ఏళ్లుగా కాపురం చేస్తూ కుటుంబ వ్యవస్థను కాపాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద, హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ డైరెక్టర్‌ స్వామి బోధమయానంద, ఏవీఎస్‌ మూర్తి, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top