breaking news
Indian family system
-
భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్‌పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్‌ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్‌పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్‌పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్‌పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్‌పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్‌కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్‌గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025 -
‘స్వలింగ వివాహం’పై ధర్మాసనం: సుప్రీం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశానికి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులు, మరోవైపు ప్రత్యేక శాసనాలు, ఇంకోవైపు ప్రత్యేక వివాహ చట్టం ఉన్నాయి. ఇంతటి ప్రధానమైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాహాలను అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాన్ని వెల్లడించడం తెల్సిందే. ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థకు స్వలింగ వివాహాలు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతుల్యతను ఇవి భంగపరుస్తాయి’ అంటూ ఆదివారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘ఈ అంశంలో శాసన అంశాలు, మానవ హక్కులు ఇమిడి ఉన్నాయి. దీనిని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరిస్తుంది’ అంటూ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఏప్రిల్ 18వ తేదీకి వాయిదావేసింది. ‘స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించాలి. ఇద్దరు తండ్రులు లేదా కేవలం ఇద్దరు తల్లులు మాత్రమే జంటగా జీవించే కుటుంబంలో ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్ ఇలాంటి విషయాలను సమీక్షించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు మొత్తం భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే కేసులో భాగస్వామ్య పక్షాల వాదోపవాదనలను విస్తృతస్థాయిలో వినాలి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఒక న్యాయవాది కోరగా రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. -
మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పది
హైదరాబాద్: భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్(తాత్కాలిక) రాఘవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. దోమలగూడ రామకృష్ణమఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించే బాలసంస్కార్– 2019 శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ చౌçహాన్ జ్యోతి వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల సంస్కార్లో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ నుంచి వచ్చాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్లాలి అనే మాటలను మనిషి అర్థం చేసుకుంటే జీవిత పరమార్థం తెలుస్తుందన్నారు. దేశంలో ఇంకా కొనసాగుతున్న ఆంగ్లేయుల గులామితత్వం పోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కంప్యూటర్లు, సెల్ఫోన్లకు, కార్టూన్ ప్రోగ్రాంలకు అలవాటుపడకుండా చూడాలన్నారు. రామాయణం, భారతం, నీతికథలు చదివేలా ప్రోత్సహించాలని, అప్పుడే వారిలో జ్ఞానం,విలువలు పెరుగుతాయని చెప్పారు. మొఘలాయిలు, ఆంగ్లేయులు ప్రపంచంలోని అనేక దేశాలను ఆక్రమించి ఆయా దేశాల చరిత్రను, సంస్కృతిని నాశనం చేసినా భారత దేశ నాగరికతను, సంస్కృతి, సంప్రదాయాలను ఏం చేయలేక పోయారన్నారు. దేవుళ్లకు అభిషేకాల పేరుతో పాలు, ఆహార పదార్థాలను వృథా చేయకుండా మురికివాడల్లోని పేదలకు, ఆస్పత్రుల్లోని రోగులకు అందించే సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తించినట్లే మనిషి కూడా తన ధర్మాన్ని నిర్వహించాలని, ప్రతి వ్యక్తిలోనూ క్రమశిక్షణ, పరోపకారం ముఖ్యమన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు వివాహం జరిగిన ఏడాది, రెండేళ్ల లోపే విడాకుల కోసం కోర్టులకు వస్తున్నారని, నిరుపేద, మధ్యతరగతి వారు మాత్రం గొడవల్లేకుండా ఏళ్లుగా కాపురం చేస్తూ కుటుంబ వ్యవస్థను కాపాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద, హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద, ఏవీఎస్ మూర్తి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నార్థకంగా కుటుంబ వ్యవస్థ
రాష్ట్ర న్యాయవాది పరిషత్ సమావేశంలో హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్‌రావు కరీంనగర్ లీగల్ : రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న విపరీత ధోరణుల వలన భారతీయ కుటుంబ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని దానిని కాపాడవలసిన బాధ్యత న్యాయవాదులపైన ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్ హాల్లో శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ తొలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారతీయ కుటుంబ వ్యవస్థ-ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పటికీ మన దేశంలోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని, అది యువతకు ఒక శిక్షణ సంస్థలా ఉపయోగపడుతోందని చెప్పారు. దీని ద్వారానే యువత తాము సమాజంలో ప్రయోజకులు కావడానికి అవసరమైన అన్ని రకాల శిక్షణలను నేర్చుకుంటున్నారన్నారు. ఇప్పుడీ భావన రానురాను క్షీణిస్తోందని ఫలితంగా దేశంలో వృద్ధజనాశ్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. వృద్ధులకు, పిల్లలకు మధ్య అంతరం పెరిగి గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడుతోందన్నారు. న్యాయవాదులు సామాజికస్పృహతో కుటుంబ వ్యవస్థపై గౌరవం పెంచేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా జడ్జి బి.నాగమారుతీశర్మ, న్యాయవాది పరిషత్ ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర న్యాయవాద పరిషత్ నూతన అధ్యక్షుడు కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాద పరిషత్ అధ్యక్షునిగా మోహన్ కరీంనగర్ లీగల్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ మొదటి అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కర్రూర్ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఆయన ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. శనివారం కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ మొదటి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది కె.లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆయన కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోశాధికారిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌరీష్ను ఎన్నుకున్నారు.