
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్‌పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్‌ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.
'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్‌లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు.
ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.
నన్ను కదిలించినది ఏమిటంటే..
అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది.
తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!
నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.
తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.
భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్‌పాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.
స్నేహితుడిని బద్నాం చేస్తారా?
మరికొందరైతే గౌరవ్‌పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్‌పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.
చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్
విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.
ఎవరీ గౌరవ్ ఖేటర్‌పాల్?
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్‌పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్‌పర్ట్ అయిన గౌరవ్‌కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్‌గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు.
Is the Indian family system dead?
A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back.
Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025