స్వతంత్ర అభ్యర్థిగా.. కసిరెడ్డి నారాయణరెడ్డి?

Independent Candidate Contest  Kasireddy Narayan Reddy Rangareddy - Sakshi

కల్వకుర్తి సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగాలని భావించిన కసిరెడ్డి నారాయణరెడ్డికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని మంత్రి కేటీఆర్‌ అసమ్మతి నేతలను బుజ్జగించినా ఫలితం లేనట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ బరిలో దిగాలని కసిరెడ్డిపై ఆయన అనుచరగణం తీవ్ర ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కసిరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆమనగల్లు (రంగారెడ్డి): ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ బరిలో దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈమేరకు తన అనుచరవర్గానికి సంకేతాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించిన ఆయనకు అధిష్టానం నుంచి చుక్కెదురైంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేయడంతో కసిరెడ్డికి నిరాశే మిగిలింది.

ఈ పరిణామాలను జీర్ణించుకోలేని ఆయన సన్నిహితులు సైతం బరిలో దిగాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.ముఖ్యంగా గత ఎన్నికల్లో జైపాల్‌కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కసిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన నేతలకు తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. దీంతో కినుక వహించిన కసిరెడ్డి.. పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. గత నాలుగైదు రోజులుగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీకి వారి నుంచి బరిలో దిగాలని తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది.

కేటీఆర్‌ సముదాయించినా.. 
కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన ఆశావహులతో ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, వెన్నంటి నిలిచినవారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన కసిరెడ్డి కూడా మెత్తబడ్డట్లే కనిపించినా.. తన అనుచరుల  నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పునరాలోచనలో పడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top