పెరుగుతున్న కుష్టు రోగులు 

Increasing Leprosy patients - Sakshi

 రాష్ట్రంలో గుర్తించిన వారి సంఖ్య 2,658

     మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో ఎక్కువమంది

     కొత్తగా పెరుగుతున్న రోగులు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రమాదకరమైన కుష్టు వ్యాధి మళ్లీ పడగవిప్పుతోంది. దశాబ్దాలుగా చికిత్సా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహమ్మారి మాత్రం అంతరించిపోవడంలేదు. కుష్టు వ్యాధి నివారణకోసం కేంద్ర ప్రభుత్వం 1955 నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. 1983 నుంచి బహుళ ఔషధాలతో నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాధి తీవ్రత మాత్రం తగ్గడంలేదు. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 2,658 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో 76 మంది పాఠశాల విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కుష్టు వ్యాధి నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నవంబర్‌ 13 నుంచి 26 వరకు కుష్టు రోగుల గుర్తింపు కార్యక్రమం జరిగింది. పల్స్‌ పోలియో తరహా లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించారు. ప్రతిఏటా రెండుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాధి కొత్తగా సోకిన వారిని గుర్తించేందుకు చేసిన ఈ ప్రక్రియలో అనుమానాస్పద కేసుల వివరాలను నమోదు చేశారు. వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. తాజా గుర్తింపు కార్యక్రమంలోనూ రాష్ట్రంలో 400 కేసులు నమోదయ్యాయి.  

లక్షణాలు... 
వయసుతో సంబంధం లేకుండా కుష్టు వ్యాధి సోకుతుంది. శరీరంపై తెల్లని, రాగి రంగు మచ్చలతో పాటు శరీరంపై కంతులు ఏర్పడతాయి. చర్మం మొద్దుబారిపోతుంది. నరాల వాపు వస్తుంది. అరిచేతులు, అరికాళ్లు స్పర్శ కోల్పోతాయి. కళ్ల నరాలు దెబ్బతింటాయి. కుష్టు వ్యాధి బాధితులు కళ్లు సగం మూసుకుని నిద్రపోతారు. వేడి, చల్లదనం తెలియదు. స్పర్శ లేని మచ్చలు ఉంటాయి. స్పర్శ లేకపోవడంతో దెబ్బలు తాకి కాళ్లు, చేతి వేళ్లు ఊడిపోవడం జరుగుతుంటుంది. 

అవగాహనే ముఖ్యం: అవగాహనతోనే కుష్టు వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించవచ్చు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది.
-డాక్టర్‌ డి.జాన్‌బాబు, కుష్టు నిర్మూలన విభాగం జాయింట్‌ డైరెక్టర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top