ప్రజల్లో అవగాహన పెరగాలి 

Increase awareness among people says Prashanth Reddy - Sakshi

‘రోడ్డు భద్రతల’పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వెంట నే వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన అయిదో రోడ్డు భద్రత మండలి సమావేశంలో ఆయన వివిధ విభాగాల అధికారులు, లారీ డ్రైవర్ల సంఘం, ఆటో యూనియన్‌ నేతలతో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారి సూచనలు స్వీకరించారు.

వాటిలో అమలు చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులను ఏ బీ సీ కేటగిరీలుగా విభజించినట్టు వెల్లడించారు. పీపీపీ పద్ధతి అమలులో ఉన్న రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఓ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పెట్రోలింగ్‌ వాహనాలు కూడా పెంచుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తిస్తున్నామని, వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నార్కెట్‌పల్లి, అద్దంకి ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని లారీ ఓనర్ల సంఘం మంత్రి దృష్టికి తెచ్చింది. రోడ్డు భద్రతపై లారీలు, ఆటోలు, క్యాబ్‌ డ్రైవర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. హెల్మెట్లు, సీట్‌బెల్ట్‌లపై ఎంత ప్రచారం చేసినా వాహనదారుల్లో నిర్లక్ష్యం పోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రెండు ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే 40 వేల లైసెన్సులను రద్దు చేసి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చామని మంత్రి చెప్పారు. చలాన్లు విధిస్తున్నా మార్పు రావటం లేదన్నారు. ఇక ముందు నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ కార్యక్రమమనే అపోహ నుంచి జనం బయటకు వచ్చి, తాము కూడా నిబంధనలు పాటించాలనే అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. నగరంలో పాదచారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనికి సంబంధించి పైలట్‌ ప్రాజెక్టు చేపడతామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top