రేవంత్‌ ఇంట్లో సోదాలు

Income Tax Rides At Revanth Reddy Home In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధి కారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న ఆస్తులు, చెల్లిస్తున్న ఆదాయపన్నుకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది.

రేవంత్‌రెడ్డి, ఆయన భార్య గీత, కుమార్తె నైమిషారెడ్డి పేరుతో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ పూర్తిస్థాయిలో వివరాలు సేకరించింది. వారి బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున జమ అవుతున్న నగదుతోపాటు విదేశాల నుంచి నగదు తరలించినట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారించింది. ఏయే బ్యాంకుల్లో ఎంత నగదు జమ అయ్యింది, విదేశీ బ్యాంకు ఖాతాల్లో ఎవరు జమ చేశారు వంటి వివరాలను ఇప్పటికే సేకరించింది. రేవంత్‌ బినామీ ఆస్తులు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు, ఆయన బ్యాంకు ఖాతాలు, విదేశాల నుంచి తరలించిన నగదు వంటి వివరాలను ఈడీ సేకరించింది. విదేశాల నుంచి కోట్లాది రూపాయలు తరలించడం, షెల్‌ కంపెనీల ద్వారా 
    
కోట్లాది రూపాయలు దారి మళ్లించడం వంటి ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ.. పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరిగినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఐటీ, ఈడీ అధికారులు గురువారం ఉదయమే రేవంత్‌రెడ్డి నివాసాలు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. ‘ఓటుకు కోట్లు’కేసులో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి అందజేసిన రూ.50 లక్షలు మనీ లాండరింగ్‌ ద్వారా వచ్చినవేనని ఈడీ అనుమానిస్తోంది. దానిలో భాగంగానే ఆ కేసులో సహ నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ రావాల్సిందిగా ఐటీ అధికారులు ఆదేశించారు.

దీంతో మధ్యలోనే ప్రచారాన్ని ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తన నివాసానికి వచ్చిన రేవంత్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. తాము ప్రశ్నించిన అంశాలపై ఓ నోట్‌ను రేవంత్‌రెడ్డికి ఇచ్చి, వీటికి తగిన డాక్యుమెంట్లు ఉంటే చూపించాలని కోరారు. రేవంత్‌ సోదరుడు కొండల్‌రెడ్డి, ఆయన భార్యను కూడా అధికారులు ప్రశ్నించారు. వీరిద్దరి పేర్ల మీద ఉన్న భూపాల్‌ కన్‌స్ట్రక్షన్స్, పలు కంపెనీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కంపెనీలకు సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. అన్నిచోట్లా తెల్లవారుజాము వరకు జరిగిన ఈ తనిఖీలు.. శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. 

పొంతన లేకుండా అఫిడవిట్‌... 
రేవంత్‌రెడ్డి 2009 ఎన్నికల్లో పోటీచేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌తో పాటు ఆ తర్వాత దాఖలు చేసిన రిటర్నులు, 2014లో రిటర్నులు, అఫిడవిట్‌లో దేనికీ పొంతన లేకుండా ఉండటాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు, ప్రతిఏటా చేసిన ఆదాయపన్ను రిటర్నులపై నోటీసుల్లో వివరణ కోరినట్టు తెలుస్తోంది. వాటిలో కోట్లాది రూపాయల తేడా ఉందని, ఆస్తులకు సంబంధించిన వివరాలను రెండుసార్లు అఫిడవిట్‌లో పేర్కొనలేదని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులు కోరారు.  

మనీలాండరింగ్‌పైనా అనుమానాలు... 
రేవంత్‌రెడ్డి ఆయన సన్నిహితులు, కుటుంబీకులు, బంధువుల పేర్ల మీద పలు షెల్‌ కంపెనీలు సృష్టించి వాటి ద్వారా వివిధ ప్రాంతాల నుంచి కోట్ల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడట్టు ఈడీ–ఐటీ సంయుక్త బృందాలు అనుమానించాయి. ఇందులో భాగంగా పలు కంపెనీల పేర్ల మీద ఉన్న బ్యాంకు ఖాతాలతోపాటు రేవంత్‌రెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన ఖాతాల్లో డబ్బులు బదిలీ అయినట్టు గుర్తించాయి. వీటికి సంబంధించిన పత్రాలతో ఈడీ, ఐటీ అధికారులు రేవంత్‌ను ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. 2014లో బ్యాంకాఫ్‌ ఈస్ట్‌ ఏసియా హాంకాంగ్‌లోని ఖాతా నెంబర్‌ 1260779653146 ద్వారా రేవంత్‌రెడ్డికి చెందినట్టుగా భావిస్తున్న కౌలాలంపూర్‌లోని ఆర్‌హెచ్‌బీ బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ 13000980508440099 లోకి రూ.60లక్షల నగదు వచ్చినట్టు దర్యాప్తు విభాగాలు అనుమానిస్తున్నాయి. అలాగే మలేషియాలోని రఘువరన్‌ మురళీ అనే వ్యక్తి నుంచి 20,00,500 డాలర్లు కూడా ఈ ఖాతాలోకి వచ్చినట్టు భావిస్తున్నాయి. ఇలా ఒక్క రోజే రెండు మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.20.38 కోట్ల డబ్బు మనీలాండరింగ్‌ ద్వారా ఆ ఖాతాలోకి చేరిందని ఐటీ, ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇదంతా 2014లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే ముందు ఫిబ్రవరి–మార్చిలో జరిగినట్టు తెలిసింది. 

కంపెనీలు–ఆరోపణలు... 
రేవంత్‌రెడ్డి తన కుటుంబీకులు, సన్నిహితుల పేర్లతో బినామీ కంపెనీలు ఏర్పాటు చేయించి ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదన్న ఫిర్యాదులను ఐటీ శాఖ స్వీకరించింది. రేవంతే ఈ కంపెనీలను వెనుకుండి నడిపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.  
– నెక్సాస్‌ ఫీడ్‌ లిమిటెడ్‌ పేరుతో రేవంత్‌రెడ్డి బంధువులు స్థాపించిన కంపెనీ ద్వారా చైనా, తైవాన్‌ నుంచి భారీ మొత్తంలో లావాదేవీలు చేసినట్టు ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ఈ కంపెనీ నుంచి ఖరీదైన ఏపీ37సీక్యూ 0999 ఫోర్సె కారును రేవంత్‌రెడ్డి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. 
– శ్రీసాయిమౌర్యా ఎస్టేట్‌ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ రేవంత్‌రెడ్డి బావమరిది, మరో నలుగురు కలిసి ఏర్పాటుచేశారని.. రేవంత్‌రెడ్డి ఇల్లే ఈ కంపెనీ చిరునామా అని అధికారులు గుర్తించారు. ఈ కంపెనీ 2003 నుంచి 2010 వరకు ఐటీ రిటర్నులు ఫైల్‌ చేసిందని, ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు రిటర్నులు దాఖలు చేయలేదని నిర్ధారణకు వచ్చారు. అయితే కంపెనీ మాత్రం యాక్టివ్‌గానే ఉండటంతో దానిపై దృష్టి సారించారు. 
– నైమిషా మైనింగ్‌ కంపెనీ రేవంత్‌రెడ్డి మామ ఎస్‌.పద్మారెడ్డి స్థాపించారని, ఆ సంస్థ 2011 వరకు మాత్రమే ఐటీ రిటర్నులు దాఖలుచేసిందని, ఆ తర్వాత కంపెనీ స్ట్రైక్‌ ఆఫ్‌ అవడంపైనా అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.  
– దుర్గా పెట్రోలియం ప్రాడక్ట్స్‌ లిమిటెడ్‌ పేరుతో సూదిని జయప్రకాశ్, గీతా అనే వ్యక్తులు 1994లో కంపెనీ స్థాపించారని, 2011వరకు లావాదేవీలు చేసిన కంపెనీ తాజాగా మూతపడటంపైనా అనుమానాలు వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది.  
– అవలాంచెస్‌ ఇన్‌ఫ్రాటెక్, విజయ మగధ ప్రాజెక్టు ఇన్‌ఫ్రా లిమిటెడ్, శ్రీమగధ ఎంటర్‌ప్రైజెస్, సాయిరోజా కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్, వీఎస్‌ఆర్‌ డెవలపర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లతో అనేక కంపెనీలు ఏర్పాటుచేసి, వాటి ఐటీ రిటర్నులు దాఖలు చేయడంలేదని ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్టు తెలిసింది.  

ఆరోపణలు రుజువైతే కేసులివే... 
రేవంత్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో దర్యాప్తు విభాగాలు ఆధారాలను గుర్తిస్తే బ్లాక్‌ మనీ, ఆదాయపు పన్ను చట్టం 2015, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ చట్టం 2002, ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ట్రాన్సాల్షన్‌ ఆక్ట్‌ 1988, ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ 1988 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు ఐటీ, ఈడీ శాఖ వర్గాలు తెలిపాయి. 2015లో పీఎమ్‌ఎల్‌ యాక్ట్‌ సవరించారని, దాని వల్ల ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే సెక్షన్లుండటం వల్ల ముందుగా నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాత విచారణలో భాగంగా ఆధారాలను బట్టి అరెస్టుపై ముందుకెళ్లనున్నట్టు దర్యాప్తు విభాగాల వర్గాలు వివరించాయి.  
కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌లోని తన ఇంటికి వస్తున్న రేవంత్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top