నిబంధనలకు పాతర!


తాండూరు: తాండూరులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా  పలు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల చిన్న పని చేసినా అనుమతులు ఉన్నాయా అని అడిగే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పెద్ద భవన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.అక్రమ నిర్మాణాల వల్ల అనుమతుల రూపంలో మున్సిపాలిటీకి రావాల్సిన లక్షల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. అయినా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులను నిద్ర మత్తు వీడటంలేదు. ‘చేతివాటం’ నేపథ్యంలో కొందరు అధికారులు అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న తాండూరులో ఇటీవల భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా రోడ్లను ఆక్రమించి, అసలు అనుమతులు లేకుండా పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు కౌన్సిలర్లు తప్పుబడుతున్నారు. అప్పుడప్పుడు పేరుకు కొందరికి నోటీసులు జారీచేసి, కోర్టులో కేసులు వేశామని చెప్పి అధికారులు మమ అనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీయల్ ఏరియా అయిన గ్రీన్ సిటీలో అక్రమ నిర్మాణాలు అధికంగా జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర విహ ంచడాన్ని మున్సిపల్ కౌన్సిలర్ సరితాగౌడ్ తప్పుబడుతున్నారు.ఈ విషయమై అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. సాయిపూర్, శాంతినగర్, చించొళి మార్గం.. ఇలా పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని, అక్రమ నిర్మాణాలు కొన్ని ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని టీఆర్‌ఎస్ కౌన్సిలర్ నర్సిం హులు విమర్శిస్తున్నారు.ఈవిషయంలో తాము సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టౌన్ పాన్లింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని కౌన్సిలర్ సుమిత్‌కుమార్‌గౌడ్ విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం రాకుండా చేస్తున్న అధికారులను నిలదీస్తామని వారు పేర్కొన్నారు. పాలకమండలి చొరవ చూపితే అక్రమ నిర్మాణాలకు కొంతవరకైనా అడ్డుకట్టపడి మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

 చర్యలు తీసుకుంటున్నాం..

 అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తాండూరు టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మీపతి చెప్పారు. నోటీసులు కూడా జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top