మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ICRISAT Focus On Mission Kakatiya In Telangana - Sakshi

మిషన్‌ కాకతీయ పూడికపై దృష్టి

పూడిక మట్టి పోసిన భూముల నుంచి శాంపిల్స్‌ సేకరణ

90 గ్రామాల్లో 990 నమూనాలు తీసుకున్న బృందాలు

భూమి క్షారత, పోషక మూలకాల లభ్యతలపై అధ్యయనం... పది రోజుల్లో ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: భూఅంతరాల్లో దాగి ఉన్న పోషకాల రహస్యాన్ని ఛేదించేందుకు అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్‌ కాకతీయ ఫలితాలెలా ఉన్నాయన్న దానిపై దృష్టి సారించిన ఇక్రిశాట్‌ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ) ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించింది. దీనికోసం 90 గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించింది. ఇద్దరితో కూడిన ఎనిమిది బృందాలు ఇక్కడ పర్యటించి ప్రతి గ్రామంలో 11 నమూనాలను సేకరించాయి. ఇందులో 10 నమూనాలు రైతుల భూములవి కాగా, మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల్లోని మట్టిని పోసిన భూముల్లో ఒక్కో నమూనా తీసుకున్నారు. ఈ నమూనాలను పరిశీలించి ఆయా భూముల్లోని పోషక విలువల వివరాలు, భూ క్షారత, మేలు చేసే మూలకాల వివరాలను సేకరించనున్నారు. ప్రస్తుతం ఈ నమూనాలు పరిశీలన దశలో ఉన్నాయని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని ఇక్రిశాట్‌ అధికారులు చెపుతున్నారు. కాగా, నమూనాల సేకరణకు వెళ్లినప్పుడు రైతులు తమ భూమిలోని పోషక విలువలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించారని, వారి సహకారంతో సేకరణ 8 రోజుల్లో పూర్తి చేయగలిగామని ఇక్రిశాట్‌ సైంటిఫిక్‌ అధికారి అరుణ శేషాద్రి తెలిపారు. నమూనాల సేకరణకు ప్రత్యేక యాప్‌ను తయారుచేసి జీఐఎస్‌తో అనుసంధానం చేసినట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top