సర్వే ఆధారంగానే లాక్‌డౌన్‌పై నిర్ణయం | Sakshi
Sakshi News home page

సర్వే ఆధారంగానే లాక్‌డౌన్‌పై నిర్ణయం

Published Fri, May 29 2020 2:21 PM

ICMR Survey On Corona Cases In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సర్వెలైన్స్‌ సర్వే నిర్వహించనుంది.హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లలో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ టీమ్స్‌ అధ్వర్యంలో శనివారం నుంచి ఐసీఎంఆర్‌ ఈ సర్వే చేపట్టనుంది. నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, టప్పా చబుత్రా ప్రాంతాల్లో సర్వెలైన్స్‌ సర్వే జరగనుంది. అందుకు సంబంధించి 5 ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్‌ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు చేశారు. ఈ ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. సర్వే ద్వారా హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు, నాస్‌ సింప్టమిక్‌ కేసులపై ఐసీఎంఆర్‌ పూర్తిస్థాయి నివేదిక తయారుచేయనుంది. చదవండి: కరోనా: 9వ స్థానానికి ఎగబాకిన భారత్‌ 

ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఐసీఎంఆర్‌ సర్వే పూర్తి చేసింది. వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయాన్ని ఐసీఎంఆర్‌ నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో సర్వే నిర్వహించి, 24 వేల శాంపిల్స్‌ను సేకరించారు. నాలుగు కేటగిరీల కింద ఈ సర్వే నిర్వహించబడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఈ సర్వే జరిపారు. వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ ఏమైనా జరిగిందా..! ఎవరికైనా వైరస్‌ సోకిన తర్వాత యాంటీ బాడీస్‌ పెరిగాయా..? లాంటి అంశాలను పరిశీలిస్తూ ఈ సర్వేను నిర్వహించనున్నారు. చదవండి: భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు! 

Advertisement
Advertisement