కరోనా: మరణాల్లో చైనాను దాటిన భారత్‌

Coronavirus: India Has Ninth Worst Hit Country By the Deadly Virus Infection - Sakshi

న్యూఢిల్లీ : రోజురోజుకీ కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. కనీస కనికరం లేకుండా ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్షా 65 వేలకు చేరింది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. కరోనాకు అధిక ప్రభావితమవుతున్న దేశాల్లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా ముందు వరుసలో ఉంది. ఆ తరువాత బ్రెజిల్‌, రష్యా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ ఉండగా భారత్‌ తొమ్మిదవ ప్రభావిత దేశంగా మారింది. టర్కీ పదవ స్థానంలో ఉండగా.. మొదటి కరోనా కేసు నమోదైన చైనా 14వ స్థానంలో కొనసాగుతోంది. (భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు! )

గడిచిన 24 గంటల్లో దేశంలో 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీని బట్టి వైరస్‌ తీవ్రత ఎంత అధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలో కరోనా మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. మరణాల్లో భారత్‌ చైనాను దాటేసింది. దేశంలో ఇప్పటి వరకు 4706 మంది ప్రాణాలు కోల్పోతే.. నిన్న ఒక్క రోజే 175 మంది మృతిచెందారు. భారత్‌లో కరోనా కేసులు చైనా కంటే రెట్టింపుగా ఉన్నాయి. దేశంలో 1,67,799 కేసులుంటే చైనాలో అధికారిక లెక్కల ప్రకారం 84,106 కేసులున్నాయి. మొదటిసారిగా కరోనా కేసు చైనాలో గతేడాది డిసెంబర్‌లో బయటపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు 59 లక్షల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. మూడున్నర లక్షల కంటే ఎక్కువ మంది మృతి చెందారు. (భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు )

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే 17 లక్షల కేసులు వెలుగుచూడగా, లక్ష మందికి పైగా మరణించారు. మరణాల పరంగా రెండో స్థానంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, తరువాత ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బ్రెజిల్‌, బెల్జియం, మెక్సికో, జర్మనీ, ఇరాన్‌ మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 11, 12 స్థానాల్లో నెదర్లాండ్‌, కెనడా నిలవగా, భారత్‌ 13వ స్థానంలో ఉంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. ఈ సంఖ్య అమెరికాలో 1.5 కోట్లకు పైగా ఉండగా, రష్యాలో 97 లక్షలు, జర్మనీలో దాదాపు 40 లక్షలు, యూకేలో 38 లక్షలు, ఇటలీ 36 లక్షలు, ఇటలీ మరియు స్పెయిన్లో 35 లక్షల పరీక్షలు జరిపారు. (సోషల్ మీడియాకు షాక్ : కత్తి దూసిన ట్రంప్)

దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్రలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో కొత్తగా 2,598 కేసులు బయటపడగా, మొత్తం కేసుల సంఖ్య 59,546కు చేరుకుంది. ఇక మరణాల విషయానికొస్తే 1,982 మంది మృతి చెందారు. ఇక ఢిల్లీలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,024 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 16,281కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,165కు పెరిగింది. జాతీయ రాజధానిలో ఒకే రోజు 1,000 కొత్త కేసులు నమోదు చేయడం ఇదే మొదటిసారి. అలాగే గుజరాత్‌లో 367 కొత్త కేసులు నమోదవ్వగా, మొత్తం సంఖ్య 15,572కు చేరుకుంది. మరో 22 మంది  మరణించగా, మొత్తం మరణౠల సంఖ్య 960 మందికి చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌ ఇప్పటి వరకు 4,536 కేసులు వెలుగుచూశాయి. (‘మేము జంతువులమా.. నీళ్లు కూడా ఇవ్వరా?’ )

భారత్‌లో కేసుల తీవ్రత గమనిస్తే ఈ నెలలో కేసుల సంఖ్య అమితంగా పెరిగింది. దేశంలో కేసులు అధికమవుతుండంతో మార్చి 25న కేంద్ర ప్రభుత్వం మొదటిసారి లాక్‌డౌన్‌(21 రోజులు) విధించింది. దీనిని ఇప్పటి వరకు మూడుసార్లు పొడగించారు. అయితే గత నెల వరకు కఠిన లాక్‌డౌన్‌ చర్యలు చేపట్టడంతో కేసులు కొంతమేర అదుపులో నమోదయ్యాయి. కానీ ఇటీవల కేంద్రం అనేక రంగాలకు సడలింపులు ఇవ్వడంతో రహదారులపై రాకపోకలు పెరిగాయి. రెండు నెలలుగా మూతపడిన దుకాణాలు తెరుచుకోవడంతో షాపుల ముందు రద్దీ పెరుగుతోంది. వీటికి తోడు ప్రత్యేక రైల్లు, విమానాల ద్వారా బయటి దేశాలు, రాష్ట్రాల నుంచి సొంత ఊళ్లకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కేసుల సంఖ్య గణనీయంగా ఎగబాకుతోంది. నాలుగో దశ లాక్‌డౌన్‌ మే 31 న ముగియనున్నఈ క్రమంలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడగిస్తారో లేదో వేచి చూడాలి. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top