డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. నాయకుడినయ్యా

I Want To Become Doctor Says By Erraballi Dayakar Rao In Warangal - Sakshi

కేఎంసీతో నాకు  45 ఏళ్ల అనుబంధం

ఎంజీఎం అభివృద్ధి కోసం పదేళ్లు కృషి చేశా.

సాక్షి, ఎంజీఎం : కాకతీయ మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులకు ఐదు  ఏళు మాత్రమే అనుబంధం ఉంటుంది.. నాకు మాత్రం కళాశాలతో 45 ఏళ్ల అనుబంధం ఉందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం కేఎంసీ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కళాశాల అంటే నాకు ప్రాణం.. మా తండ్రి కోరిక మేరకు డాక్టర్‌ కావాలని అనుకుడినే వాడిని.. కాని రాజకీయ నాయకుడిని.. మంత్రిని అయ్యాను.. వైద్యవృత్తి అంటే తనకు ఎంతో ఇష్టం.. రాజకీయ  ఎదుగుదలకు వైద్యులు ఎంతో కృషి చేశారు’ అని అన్నారు. ఎల్బీ కళాశాలలో చదువుతున్నప్పుడు కాకతీయ మెడికల్‌ కళాశాలలో బుల్లెట్‌ మీద తిరిగేవాడిని.. నాటి మధుర స్మతులు నేటికీ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో వైద్యులకు అరుదైన గౌరవం ఉందని, అంకిత భావంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. 

వజ్రోత్సవాలకు రూ.కోటి
కేఎంసీ వజ్రోత్సవ వేడుకల కోసం సీఎం కేసీఆర్‌ రూ.కోటి కేటాయించారని, ఆ బడ్జెట్‌ అమలు ఎక్కడ నిలిచిపోయిందో తనకు తెలియందని మంత్రి అన్నారు. 1994 నుంచి 2004 వరకు ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కోసం జోలె పట్టుకుని చందాలు వసూలు చేశానని, వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి కోసం పాటుపడ్డాడని గుర్తు చేశారు. ఎంజీఎం అభివృద్ధి నా వల్లే జరిగిందని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి పేర్కొన్నారని, నా స్ఫూర్తితోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేశారని అన్నారు. స్వయంగా ఈ అంశాన్ని రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో వెల్లండిచారని పేర్కొన్నారు.

సెంట్రల్‌ జైలు తరలింపునకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలువురు వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్, అలుమినీ కమిటీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్‌ కాళీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పలువురు వైద్యులకు ఘన సన్మానం
వజ్రోత్సవ వేడుకల సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అలుమినీ కమిటీ సభ్యులతో పాటు కళాశాల కమిటీ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  ఘనంగా సత్కరించారు.

ఆరోగ్యంగా జీవించడమే గొప్ప వరం
ఆరోగ్యంగా జీవించడమే గొప్పవరం.. ఆస్తులను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు..  ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించుకోలేమని నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం సైకియాట్రిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె వాక్‌ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాక్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల నుంచి ఎంజీఎం మీదుగా కొనసాగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సుబ్రమణ్యేశ్వర్‌ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు పాటించి జీవితాన్ని సంతోషాన్ని గడపాలని సూచించారు.

వైద్యులపై జరుగుతున్న దాడులను  ఆయన తీవ్రంగా ఖండిస్తూనే.. దాడుపై మనం ఆలోచించాల్సి అవసరం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ సంధ్య, వైద్యులు డాక్టర్‌ ఎర్ర శ్రీధర్‌రాజు, ఐఎంఏ అధ్యక్షుడు నల్లా సురేందర్‌రెడ్డి, రాంకుమార్‌రెడ్డి, బందెల మోహన్‌రావు, జార్జిరెడ్డి, మన్మోహన్‌రాజు, డాక్టర్‌ సంధ్యరాణి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
–  నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top