
సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో చేరడం లేదని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్ అన్నారు. ముందస్తు రాజీనామాను ఆమోదించాలని కేంద్రానికి తాను రాసిన లేఖపై పలు ప్రచారాలు జరుగుతున్న వేళ గురువారం ఆయన మరో లేఖను విడుదల చేశారు. ‘రాజకీయ నేతలు ఏ రాష్ట్రాన్నీ బంగారంగా మార్చలేరు, రాజ్యాంగపరంగా ప్రజలే కీలకమైనా, వారు బలవంతుల చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. దీనికి రాజకీయాలను, నేతలను తప్పుబట్టలేం, లోపం ప్రజల్లోనే ఉంది. అందుకే వివేకానంద, మహాత్మాగాంధీ, అన్నాహజారే బాటలో పయనిస్తూ ప్రజల కోసం పాటుపడతా. సుపరిపాలనతో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన దేశాలకంటే మంచి ప్రగతిని సాధిస్తుంది. దీనికి టీఎస్‌పీఏనే చక్కటి ఉదాహరణ. ముందస్తు రిటైర్మెంట్‌కు కేంద్రం అనుమతించగానే నా భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తా’అని లేఖలో స్పష్టం చేశారు.