కరోనా కంగారు!

Hyper Vigilance in Single Familes Hyderabad - Sakshi

కోవిడ్‌ భయంతో పెరుగుతున్న మానసిక రుగ్మతలు  

‘హైపర్‌ విజిలెన్స్‌’ వల్ల అనర్ధాలంటున్న నిపుణులు  

ఆందోళన, కుంగుబాటు, ద్వంద్వ ప్రవృత్తి వంటి లక్షణాలు

అప్రమత్తత ‘అతి’గా మారితే ముప్పే...

హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక మహిళకొద్దిరోజులుగా ఆకస్మాత్తుగా  కుంగుబాటుకు గురయ్యారు. ప్రతి అరగంటకు ఒక్కసారి కాళ్లు, చేతులు కడుక్కోవడం, ఇల్లంతా శుభ్రంచేయడం, తలుపులు, కిటికీలు వంటివన్నీమూసి ఉంచడంతో పాటు...ఏ క్షణంలోకరోనా  వస్తుందోనన్న భయాందోళనతోకుమిలిపోయారు. రెండు రోజుల క్రితంకుటుంబ సభ్యులు మానసిక వైద్యనిపుణులను సంప్రదించారు.  

సికింద్రాబాద్‌కు చెందిన ఒక అబ్బాయికిజ్వరం వచ్చింది. జలుబు, దగ్గు, ఇతరత్రా లక్షణాలేవీ లేవు. కేవలం జ్వరం మాత్రమే.కానీ ఆ కుటుంబం మొత్తం తీవ్ర ఆందోళనకు గురైంది. 15 ఏళ్ల వయస్సున్న ఆ కుర్రాడి బాధను  ఇంక మాటల్లో చెప్పలేం.డాక్టర్‌ను సంప్రదించారు. సాధారణజ్వరమేనని  ఎలాంటి ఆందోళన అవసరంలేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఈ ఒకటి, రెండు కుటుంబాల్లోనే కాదు.  ఇప్పుడు నగరంలో ఎవరికి  ఎలాంటి ఆరోగ్య సమస్యలు  తలెత్తినా సరే కరోనాకు ముడిపెట్టి  బెంబేలెత్తిపోవడం పరిపాటిగా మారింది. సాధారణ జబ్బులను సైతం కరోనాకు ముడిపెట్టి కుంగుబాటుకు గురవుతున్న వాళ్లు కొందరైతే...ఏ జబ్బులూలేకపోయా కరోనా పట్ల అతిగా స్పందిస్తూ ఆందోళనకు గురవుతున్నవాళ్లు మరి కొందరు....లాక్‌డౌన్‌తో అన్ని రకాల మానవ సంబంధాలు తెగిపోయి ఇళ్లకే పరిమితమైన ఒంటరి కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయి. 

హైపర్‌ విజిలెన్సే  అసలు సమస్య....
కరోనా కంటే  పుకార్లు  శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. సోషల్‌  మీడియా  ప్రతి ఇంట్లో చిచ్చు రేపుతోంది. అబద్ధాలు, అసత్యాలతో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో  ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొనేందుకు పత్రికలు, టీవీ చానళ్లే  పరిష్కారంగా  కనిపిస్తున్నాయి. దీంతో ఇరువై నాలుగు గంటలు కరోనా వార్తలను వీక్షిస్తూ మెదళ్లలో ఏ మాత్రం ఖాళీ లేకుండా  నింపేసుకుంటున్నారని, ఇలాంటి హైపర్‌ విజిలెన్స్‌ కేసుల్లోనే మానసిక సమస్యలు  తలెత్తుతున్నాయని ప్రముఖ సైకియాట్రిస్టు డాక్టర్‌ సంహిత  చెప్పారు. ‘కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. కానీ అతిగా స్పందించి మానసిక సమస్యలను కొని తెచ్చుకోవడం సరైంది కాదు. ’ అన్నారు. కరోనాపై అతిగా స్పందించడం వల్ల  ఇంట్లో ఏ వస్తువును తాకినా  కరోనా వస్తుందోమోననే భయంతో  బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి వారిలో పరిశుభ్రత కాస్తా అతి పరిశుభ్రతగా మారి చేసిన పనిని పదే పదే చేయడం ద్వంద్వ ప్రవృత్తికి గురవుతున్నట్లు  మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో ఇలా చేస్తే  మేలు....
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకే ఈ లాక్‌డౌన్‌ అనే సంగతి మరిచిపోవద్దు. ఈ సమయంలో చక్కటి ఆరోగ్య సూత్రాలను, డైట్‌ను పాటించాలి. నచ్చిన పుస్తకాలు చదువుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఇరవై నాలుగ్గంటలూ వార్తా చానళ్లు వీక్షించడం సరైంది కాదు.  పరిమితంగా టీవీ చూడాలి.  
లాక్‌డౌన్‌ వల్ల  ఒంటరిగా  ఉంటున్నామనే భావనకు గురికాకుండా స్నేహితులు, బంధువులతో వీడియోకాల్స్‌లో  మాట్లాడుకోవాలి. 
పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి లాక్‌డౌన్‌ పిల్లలపైన ఎక్కువగా ప్రభావం పడకుండా చూసుకోవాలి. నిత్యం ఆట, పాటలతో స్నేహితులతో  సరదాగా గడపాలని కోరుకొనే పిల్లలకు లాక్‌డౌన్‌ నిరాశ కలిగించేదే. ఈ  ప్రభావం పిల్లలపైన పడకుండా ఇంట్లోనే వాళ్లకు నచ్చిన కార్యక్రమాలు, సినిమాలు, పుస్తక పఠనం, చక్కటి ఇండోర్‌ గేమ్స్‌ వంటి వాటితో బిజీగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.– డాక్టర్‌ సతీష్, న్యూరో సైకియాట్రిస్ట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top