రియల్‌ రైడ్‌ చేయండి.. | Hyderabad Traffic Police Trying To Provide Real Time Traffic Information | Sakshi
Sakshi News home page

రియల్‌ రైడ్‌ చేయండి..

Sep 27 2019 3:10 AM | Updated on Sep 27 2019 3:10 AM

Hyderabad Traffic Police Trying To Provide Real Time Traffic Information - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల భాగ్యనగరంలో గణేశుడి శోభాయాత్ర జరిగింది. అప్పుడు ట్రాఫిక్‌ అధికారులు కొన్ని ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఏయే మార్గాల్లో శోభాయాత్ర జరుగుతోంది.. ఎటువైపు రోడ్లు మూసేశారు.. ఇలా అన్ని వివరాలను గూగుల్‌ మ్యాప్‌లో పొందుపరిచారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీన్నే రియల్‌ టైమ్‌ సమాచారం అందించడం అంటారు. అయితే ఇలా సాధారణ రోజుల్లో కూడా వాహనదారులకు అందించాలని ట్రాఫిక్‌ విభాగం యోచిస్తోంది. ఇందుకు గురువారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ గూగుల్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్‌ పోలీసులు అందించే సమాచారం ఆధారంగా ప్రత్యేక మార్కింగ్స్‌తో వివరాలను మ్యాప్స్‌లో పొందుపరిచేందుకు గూగుల్‌ అంగీకరించింది. ట్రయల్‌ రన్‌ నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

దాదాపు ప్రతి వాహనదారుడు గూగుల్‌ మ్యాప్స్‌ సాయం తీసుకుంటున్నాడు. అందులో సూచించిన ప్రకారం ఏయే మార్గాల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉందో తెలుసుకుని ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నాడు. దీంతో వాహనదారులకు మరింత మెరుగైన సమాచారం అందించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చే విధానంతో ఏయే రోడ్లు మూసేశారు.. అందుకు కారణాలు.. ఎన్ని రోజుల పాటు అలా ఉంటుంది.. తదితర అంశాలు గూగుల్‌ మ్యాప్స్‌లో ప్రత్యక్షం కానున్నాయి. రహదారుల మూసివేత మాత్రమే కాకుండా కీలక సమయాల్లో విధించే ట్రాఫిక్‌ ఆంక్షలు/మళ్లింపులు, ధర్నాలు/ నిరసనలు, సభలు/ సమావేశాలు, ప్రమాదాలతో పాటు రోడ్డు మరమ్మతులు.. ఇలా ఏ విషయమైనా ప్రత్యేక గుర్తులతో గూగుల్‌ మ్యాప్స్‌లో పొందుపరచనున్నారు.  

వర్షం పడినా చెప్పేస్తుంది.. 
రోడ్ల మరమ్మతులతో వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు ఆయా విభాగాలకు ట్రాఫిక్‌ అధికారులు నిర్ణీత సమయం ముందు లిఖిత పూర్వకంగా అనుమతి ఇస్తారు. అలా చేసిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్‌కు అందజేస్తారు. ఆయా మార్గాల్లో మళ్లింపులు/ఆంక్షలు మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఆ సమయాన్ని సూచిస్తూ గూగుల్‌ మ్యాప్స్‌లో పొందుపరుస్తారు. వర్షం నీరు నిలవడం, ప్రమాదాలు జరగడంతో ఏర్పడే ట్రాఫిక్‌ జామ్‌ వివరాలను బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్, కంట్రోల్‌ సెంటర్‌కు చెందిన అధికారులు గూగుల్‌కు అందిస్తారు. ఇందుకు పలు ప్రాంతాలో అమర్చిన సీసీ కెమెరాలను వినియోగిస్తారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌ సిబ్బంది నుంచి సమాచారం తీసుకుంటూ గూగుల్‌కు అందిస్తూ మ్యాప్‌లో అప్‌డేట్‌ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement