
ముంబై: సాఫీగా రోడ్డు ప్రయాణం సాగేలా దారిచూపాల్సిన గూగుల్స్ మ్యాప్స్ యాప్ ఒక్కోసారి ప్రయాణికులను కాలువల్లోకి, చిట్టడవుల చెంతకు చేరుస్తోంది. అలాంటి మరో ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ఒక మహిళ కారులో వంతెన మీదుగా ప్రయాణించాల్సిందిపోయి పక్కనే ఉన్న మురుగుకాలువలోకి నేరుగా పడిపోయింది.
నవీ ముంబైలోని బేలాపూర్‌లో ఒక ఆడీ కారు కాలువలో పడిన ఈ ఉదంతం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒంటి గంటకు జరిగింది. శుక్రవారం రాత్రి మహిళ ఒంటరిగా ఆడీ కారు లో నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతానికి బయల్దేరారు. బేలాపూర్ వద్ద ఎదురుగా వంతెనను దాటా ల్సి ఉండగా గూగుల్ మ్యాప్స్ మాత్రం పక్కకు వెళ్లాలని తప్పుడు సూచన చేసింది.
ఆమె మరో ఆలోచన చేయకుండా యాప్ చెప్పిన దారిలోనే కారును ముందుకు పోనిచ్చారు. హఠాత్తుగా దారి కాస్త మురుగుకాల్వగా మారింది. బేలాపూర్ పేద్ద కాల్వలో కారు పడిపోవడంతో ఆమె కాపాడండంటూ హాహాకారాలు మొదలెట్టారు. స్థానికుల సమాచారంతో మెరైన్‌సెక్యూరిటీ బృంద సభ్యులు రంగంలోకి దిగి పడవలో వెళ్లి ఆమెను కాపాడారు.