గూగుల్‌ మ్యాప్‌తో ‘మెట్రో’ నంబర్ల అనుసంధానం

Hyderabad Metro Pillars To Be Linked With Google Maps Shortly - Sakshi

గూగుల్‌ మ్యాప్‌తో మెట్రో పిల్లర్‌ నంబర్ల అనుసంధానం

త్వరలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆఫీస్‌లు, మాల్స్, ఆస్పత్రులకు కేరాఫ్‌ ఇవే

మూడు కారిడార్లనుఏ, బీ, సీలుగా వర్గీకరణ

తొలి విడతగా ప్రకాశ్‌నగర్‌–రసూల్‌పురా మార్గంలో నంబర్లు

  • సార్‌.. మీకు కొరియర్‌ వచ్చింది.. మీ అడ్రస్‌ ఎక్కడ..? మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1392 వద్దకు వచ్చేశావనుకో.. ఆ ఎదురు సందులో..
  • డాడీ క్యాబ్‌ బుక్‌ చేస్తున్నా.. సినిమా థియేటర్‌ అడ్రస్‌ ఎక్కడ..? మెట్రో పిల్లర్‌ నంబర్‌ 506.. దాని ఎదురుగానే షాపింగ్‌ మాల్, మల్టీప్లెక్స్‌..

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో నగరంలోని అడ్రస్‌లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయి. ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో జీపీఎస్‌ సాంకేతికతతో గూగుల్‌ మ్యాప్‌ కు అనుసంధానించనున్నారు. వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారనున్నాయి. ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌– ఫలక్‌నుమా, నాగోల్‌–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. మార్గంలోని 2,541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ప్రకాశ్‌నగర్‌–రసూల్‌పురా మార్గంలో సీ1,300–సీ1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని చిన్నగా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో పెద్ద పరిమాణంలో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ వర్గాలు తెలిపాయి. కాగా పీవీ ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్‌మార్క్‌ చిహ్నలుగా మారనుండటం విశేషం.

ఎల్బీనగర్‌ పిల్లర్‌ నం.1..?
మెట్రో కారిడార్లలో ‘ఏ’కారిడార్‌గా పిలిచే ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ.) మార్గంలో ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు వద్ద పిల్లర్‌ నం.1 ఏర్పాటుకానుంది. ఈ మార్గంలో మొత్తం 1,108 పిల్లర్లున్నాయి. ఇక జేబీఎస్‌–ఫలక్‌నుమా (15 కి.మీ.) మార్గాన్ని ‘బీ’కారిడార్‌గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 588 పిల్లర్లున్నాయి. నాగోల్‌–రాయదుర్గం (28 కి.మీ.) మార్గంలో 845 పిల్లర్లున్నాయి. ఈ మార్గంలోనే ప్రస్తుతానికి ప్రకాశ్‌నగర్‌–రసూల్‌పురా మార్గంలోనే సి1300–సి1350 వరకు నంబర్లను కేటాయించారు. ఇక మెట్రో రెండోదశ కింద ఎబ్బీనగర్‌–నాగోల్, ఎల్బీనగర్‌–ఫలక్‌నుమా, రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ తదితర మార్గాల్లోనూ ఏర్పాటుచేసే పిల్లర్లతో వీటి సంఖ్య మరింత పెరగనుంది.

జీపీఎస్‌తో అడ్రస్‌ ఈజీ...
మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ కారిడార్లకు రెండు వైపులా వేలాది కాలనీలు, బస్తీలున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లలో గ్రేటర్‌ సిటిజన్లే కాకుండా ఇతర జిల్లాల వాసులూ రాకపోకలు సాగిస్తారు. వీరికి ఇప్పుడు ఆయా కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను తేలికగా గుర్తించేందుకు పిల్లర్‌ నంబర్లే ఆధారం కానున్నాయి. ఈ పిలర్ల నెంబర్లను జీపీఎస్‌ సాంకేతికతతో గూగుల్‌ మ్యాప్‌కు అనుసంధానం చేయనుండటంతో.. పిల్లర్‌ నంబర్‌ ఆధారంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top