గుంతలు..గెంతులు

Hyderabad City People Suffering With Rain Potholes - Sakshi

భారీగా గుంతలు తేలిన నగర రోడ్లు

చినుకు.. ‘వెన్ను’లో వణుకు

వెన్ను, నడుం నొప్పులతో ఆస్పత్రుల్లో చేరిక

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు..కాలనీలను ముంచెత్తుతున్న వరదలు నగర రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. గుంతల రోడ్లలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. అరకిలోమీటరు ప్రయాణిస్తే చాలు 60 గుంతలపై గెంతాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా వాహనాలే కాదు ప్రయాణికుల ఒళ్లు హూనమవుతోంది. వెన్నుపూస కదిలిపోతోంది. నొప్పిని భరించలేక ఆస్పత్రులకు చేరుతున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. నిమ్స్‌ సహా ఏ కార్పొరేట్‌ ఆస్పత్రిలోకి తొంగి చూసినా బ్యాక్‌పెయిన్, ఒంటి నొప్పి బాధితులే దర్శనమిస్తున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో:  మెట్రోరైల్‌ వర్క్స్‌...విద్యుత్‌ కేబుళ్లు..సివరేజ్‌ పైప్‌లైన్స్‌ కోసం తవ్విన గుంతలు ఇప్పటికే ప్రయాణికులను ఓ కుదుపు కుదుపుతుండగా, ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రహదారులనే కాదు నగరవాసుల ఒళ్లును కూడా గుల్ల చేస్తున్నాయి. వీవీఐపీలు తిరిగే బంజారాహిల్స్, బేగంపేట్, ఎన్టీఆర్‌మార్గ్, రాజ్‌భవన్‌రోడ్డు, అసెంబ్లీ, పంజగుట్టా, లక్టీకపూల్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి రహదారులపై కూడా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఎల్బీనగర్‌ నుంచి  మొజంజాహీమార్కెట్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, నల్లకుంట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ చౌరస్తా రహదారులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. అడుగుకోగుంత కన్పిస్తుంది. తెలుగుతల్లి, పంజాగుట్టా, బేగంపేట్, ప్యారడైజ్, మెహిదీపట్నం ప్‌లైఓవర్లపై కూడా భారీ గుంతలు ఏర్పాడ్డాయి. మంగళ, బుధవారాల్లో వర్షం కురియకపోయినా  గుంతల్లోని నీరు అలాగే నిల్వఉండటంతో తెలియక వేగంగా దూసుకొచ్చి ఒక్కసారిగా కుదుపునకు లోనవుతున్నారు. బైక్‌లు స్క్రిడై ప్రమాదాలు జరుగుతున్నాయి. దెబ్బలు తగిలి ఆస్పత్రుల్లో చేరుతుండగా, మరికొందరు స్పైన్, నెక్, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. 

గతంలో 70 ఉంటే..ప్రస్తుతం 150 కేసులు
వాహనం నడిపే వారే కాదు..వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా వెన్ను, భుజం, తొడ, మెడ జాయింట్స్‌ పెయిన్స్‌ తప్పడం లేదు. బైక్‌ నడిపే వారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారు నడిపేవారు నడుము, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నిమ్స్‌ సహా అపోలో, యశోద, కేర్, కిమ్స్, సన్‌ షైన్‌ తదితర ఆస్పత్రుల్లోని ఆర్థోపెడిక్‌ విభాగాలకు చేరుతున్న బాధితుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ విభాగం సగటు ఓపీ 70 ఉండగా, ఇటీవల ఈ ఓపీ రోగుల సంఖ్య 150కి పెరిగింది. బాధితుల్లో 60 శాతం మండి ఒంటినొప్పులతో బాధపడుతుంటే, 15 శాతం మంది వెన్నుపూసలో డిస్కుల అరుగుదల వల్ల వచ్చే బ్యాక్‌పెయిన్‌తో బాధపడుతున్నారు. పది శాతం మంది నెక్‌పెయిన్‌తో బాధపతుంటే, ఐదు శాతం మంది బోన్‌ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నట్లు సన్‌షైన్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యనిపుణురాలు డాక్టర్‌ చిరంజీవి తెలిపారు.

జాగ్రత్తలు తీసుకోవాలి : డాక్టర్‌ రామ్‌ కమల్, ఆర్థోపెడిషియన్, శ్రీకర ఆస్పత్రి
గతంతో పోలిస్తే ఇటీవల ఆర్థోపెడిక్‌ సంబంధిత కేసులు పెరిగాయి. గుంతలు తేలిన రోడ్లపై గంటల తరబడి ప్రయాణించడం వల్ల వాహనాల కుదుపులకు ఒళ్లుగుల్ల అవుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కొంతమంది వృద్ధులు బోన్‌ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నారు. వర్షాకాలనికి ముందు మా ఆస్పత్రికి రోజుకు సగటున 70మంది వస్తే..ప్రస్తుతం ఈ సంఖ్య 150కి చేరుకుంది. నిజానికి బైక్‌ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్‌ వంచకుండా నిటారుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కారులో సిట్టింగ్‌ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి. వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు అనించి కూర్చోవాలి. గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నప్పుడు వేగం తగ్గించాలి. లాంగ్‌ జర్నీ చేసేప్పుడు ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top