రుణాలతోనే గట్టెక్కేది?

Huge allocations for irrigation in the current full budget - Sakshi

ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్‌లోనూ  సాగునీటికి భారీ కేటాయింపులు

రూ. 26 వేల కోట్ల బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్ల మేర రుణాలే

ప్రభుత్వానికి చేరిన నీటిపారుదల శాఖ బడ్జెట్‌ అంచనాలు

సాక్షి, హైదరాబాద్‌: పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు మరోమారు అగ్రతాంబూలం దక్కనుంది. గతంలో మాదిరే ఈ ఏడాది నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కలిపి రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బడ్జెట్‌ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిన నీటిపారుదల శాఖ రూ.26 వేల కోట్లతో అంచనాలు వేసింది. ఇందులో ఇప్పటికే కార్పొరేషన్‌ల ద్వారా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసేలా అంచనాలు సిద్ధమైనట్లు సమాచారం.  

రుణాలే ఆధారం.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో ఆరు నెలల కాలానికి రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. పనులకు సంబంధించి మరో రూ.5వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఈ నెలలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లో రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా రూ.25 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముగింపు దశకొచ్చిన నేపథ్యంలో కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం పాలమూరు–రంగారెడ్డికి దక్క నుంది.

ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర రుణాలను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకునేందుకు అనుమతి రాగా ఇందులో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లమేర ఖర్చు చేసేలా కేటాయింపులు చేసే చాన్సుంది. ఇక కాళేశ్వరానికి రూ.6వేల కోట్ల మేర కేటాయింపులతో అంచనాలు వేయగా, ఇందులో రుణాల ద్వారానే అధిక ఖర్చు చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి  కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ. 6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇక పూర్వ మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top