కంటి వెలుగుకు ఆ‘పరేషాన్‌’ | Hospitals Neglect On Kanti Velugu Scheme Operations | Sakshi
Sakshi News home page

కంటి వెలుగుకు ఆ‘పరేషాన్‌’

Sep 10 2018 8:57 AM | Updated on Sep 10 2018 1:42 PM

Hospitals Neglect On Kanti Velugu Scheme Operations - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఆ‘పరేషాన్‌’ తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా కాటరాక్ట్‌ సమస్య ఉన్నట్లు గుర్తించిన రోగులకు సకాలంలో ఆపరేషన్లు జరగడం లేదు. శిబిరాల్లో వైద్యులు బాధితులను గుర్తించి ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా శుక్లాల ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఎంతో ఆశతో  ఆస్పత్రులకు వెళ్లిన రోగులకు నిరాశే మిగులుతోంది. దీనికితోడు ఇప్పటివరకు రీడింగ్‌ గ్లాసులు మినహా మల్టిపుల్‌ విజన్, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిలో ఒక్కరికి కూడా కళ్లజోళ్లు అందించకపోవడం గమనార్హం. సరోజినిదేవి కంటి ఆస్పత్రి సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చే ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు సర్జరీలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో బాధితులు దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు. 

అందని కళ్లజోళ్లు
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 98 క్యాంపులు ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన ఒక్కో క్యాంపులో ఆరుగురు చొప్పున మొత్తం 588 మంది సిబ్బందిని నియమించింది. వీరు ఇప్పటి వరకు 2,04,786 మంది రోగులను పరీక్షించారు. ఇందులో 83171 మంది పురుషులు కాగా, 120598 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 42649 మందికి రీడింగ్‌ గ్లాసులను పంపిణీ చేశారు. మరో 69284 మందికి మల్టిపుల్‌ విజన్‌ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి సమస్యను బట్టి ప్రత్యేకంగా కళ్లజోళ్లను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అద్దాలు అందజేయలేదు. మరో 11,825 మందికి కాటరాక్ట్‌ సమస్య బాధపడుతున్నట్లు గుర్తించి ఆపరేషన్‌ నిమిత్తం నగరంలోని ఆనంద్‌ నేత్రాలయం, హరికృష్ణ నేత్రాలయం, మెడివిజన్, ఎల్వీప్రసాద్, పుష్పగిరి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ప్రిన్సెన్‌ఇస్రో, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులకు సిఫార్సు చేశారు. అయితే ఆయా ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 95 కాటరాక్ట్‌ సర్జరీలు మాత్రమే జరిగాయి. ఇందులో ఎల్వీప్రసాద్, హరికృష్ణ నేత్రాలయా ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు ఒక్క సర్జరీ కూడా చేయకపోవడం విశేషం. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిర్వాహకులు చికిత్సలకు వెనుకాడుతున్నట్లు సమాచారం.  

గుర్తింపుతోనే సరి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటిచార్ట్‌ సహాయంతో ప్రాథమిక కంటి పరీక్ష(అన్‌ ఎయిడెడ్‌ విజువల్‌ ఆక్యూటీ)తో పాటు సవివరమైన కంటిపరీక్ష(ఆబ్జెక్టివ్‌ రీఫ్రాక్షన్‌)లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సామాగ్రి కూడా ప్రభుత్వమే సమకూర్చింది. ఇందులో భాగంగా వైద్యులు కంటి సమస్యను గుర్తించి మందులతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు సిఫార్సు చేస్తున్నారు. రీడింగ్‌ గ్లాసులు అవసరమైన వారికి అక్కడికక్కడే అందజేస్తున్నప్పటికీ..ప్రిస్కిప్షన్‌ రాసిన వారికి నాలుగు వారాల గడువు ఇచ్చారు. వీటి తయారీ బెంగుళూరుకు చెందిన ఈఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. క్యాటరాక్ట్‌ సర్జరీలు అవసరమైన వారిని కేవలం గుర్తింపునకే పరిమితమవుతోంది. బాధితులను ప్రభుత్వమే సయంగా ఆస్పత్రులకు తీసుకెళ్లి సర్జరీలు చేయించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆపరేషన్లు జరగడం లేదు. చికిత్స చేయించుకునేందుకు బాధితులే స్వయంగా ఆస్పత్రులకు వస్తున్నా ప్రభుత్వం చెల్లిస్తున్న వైద్య ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో కంటి వెలుగు బాధితులను చేర్చుకునేందుకు ఆస్పత్రులు నిరాకరిస్తుండటంతో రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement