హెచ్‌ఎండీఏ డేటా సేఫ్‌

HMDA Data Safe Hyderabad - Sakshi

వీడిన మాల్‌వేర్‌ చిక్కుముడి  

సేఫ్‌గా డీపీఎంఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ వివరాలు  

ఊపిరి పీల్చుకున్న అధికారులు

నేటి నుంచి అందుబాటులోకి ఆన్‌లైన్‌ సేవలు  

మేల్కొన్న ఉన్నతాధికారులు.. ఇంటర్నెట్‌ వాడకంపై ఆంక్షలు

వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు

సాక్షి,సిటీబ్యూరో: దాదాపు పదిరోజులుగా నిలిచిపోయిన హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆన్‌లైన్‌ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి హెచ్‌ఎండీఏ సంస్థకు చెందిన అధికారి జీమెయిల్‌కు వచ్చిన మాల్‌వేర్‌ను నొక్కారు. దీంతో సంస్థ సర్వర్లలోకి వైరస్‌ ప్రవేశించి ఆవి పనిచేయడం మానేశాయి. అంతేకాకుండా డేటా సైతం ఎన్‌క్రిప్ట్‌ అయింది. దీంతో డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌), లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల వివరాలు తెరుచుకోలేదు. దీంతో ఆయా సేవలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అధికారుల్లోనూ, అటు దరఖాస్తుదారుల్లోనూ ఆందోళన మొదలైంది.

కొన్ని రోజులు కంప్యూటర్లతో కుస్తీ పట్టిన ఇక్కడి అధికారులు సమస్యను పరిష్కరించలేకపోవడంతో స్టేట్‌ డేటా సెంటర్‌లోని సెక్యూరిటీ ఆపరేటర్‌ సెంటర్‌ను సంప్రదించారు. ఆన్‌లైన్‌లో తెరుచుకోలేని అన్ని దరఖాస్తుల ఎన్‌క్రిప్ట్‌లను అక్కడికి పంపించగా.. పరిశోధించిన అధికారులు చివరకు వాటికి సాంకేతిక పరిష్కారం కనుగొని డేటాను తిరిగి రాబట్టారు. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వర్లలోని హెచ్‌ఎండీఏ డీపీఎంఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ డేటా భద్రంగా ఉండడంతో దరఖాస్తుదారులు  ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోమవారం ఉదయం 9.30 నుంచి ఎప్పటిలాగే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు ఆదివారం ప్రకటించారు. కొన్ని రోజులుగానిలిపివేసిన సేవలు పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రయోగాత్మకంగా ట్రయల్‌ రన్‌ కూడా చేశామని ఆయన తెలిపారు.  

మేల్కోకుంటే మళ్లీ మాల్‌‘బేర్‌’..
హెచ్‌ఎండీఏ అధికారి మెయిల్‌కు వచ్చిన మాల్‌వేర్‌ వైరస్‌ మొత్తం సంస్థ పనిపై తీవ్ర ప్రభావం చూపించింది. దాదాపు పది రోజుల పాటు సంస్థ సేవలు నిలిపివేయాల్సి వచ్చింది. అన్‌లైన్‌ ఫైళ్లు కరప్ట్‌ కాకుండా ఉండేందుకు డీపీఎంఎస్‌ సేవలు అందిస్తున్న సాఫ్‌టెక్‌ సంస్థతో పాటు ఐటీ అధికారులు యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంపై దృష్టి సారించాలి. అలాగే సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలు, సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న మోసాలపై హెచ్‌ఎండీఏ సిబ్బందిని జాగృతి చేయాల్సిన అవసరముందని నిపుణులు అంటున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పంపిన మాల్‌వేర్‌ వైరస్‌తో ఇప్పటిలా హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ సేవలన్నీ నిలిపివేయాల్సిన పరిస్థితి మళ్లీ రాకుండా సమూల చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఐటీ అధికారులతో పాటు సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో హెచ్‌ఎండీఏ సిబ్బందికి సైబర్‌ నేరాలపై అవగాహన కలిగించాలని హెచ్‌ఎండీఏ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.  

ఇంటర్నెట్‌ వాడకంపై ఆంక్షలు..
మాల్‌వేర్‌ దెబ్బతో హెచ్‌ఎండీఏ సిబ్బంది ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వినియోగించడంపై ఆంక్షలు విధించినట్టు తాజాగా సమాచారం. ఫేస్‌బుక్, అర్కుట్, ట్విట్టర్‌ వంటి సేవలను పూర్తిగా నిషేధించారు. అధికారిక పనుల కోసం మాత్రం ‘హెచ్‌ఎండీఏ.జీఓవీ.ఇన్‌’ పేరు వచ్చేలా సిబ్బంది అందరికీ మెయిల్స్‌ క్రియేట్‌ చేసి వాటి ద్వారానే పనులు చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జీమెయిల్స్‌ కూడా ఇష్టమొచ్చినట్టుగా ఉపయోగించవద్దని ఆదేశించారు.     

వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చింది..!
దాదాపు పదిరోజుల పాటు హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ సేవలను స్తంభింపజేసిన ఈమెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంపై హెచ్‌ఎండీఏ ఐటీ అధికారులు దృష్టి సారించారు. రష్యా, రొమేనియా, పాకిస్థాన్, హాంకాంగ్‌ తదితర దేశాల్లో మాల్‌వేర్‌ కోడ్‌ రాసి మెయిల్స్‌ చేస్తూ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల సేవలను స్తంభింపచేయడం పరిపాటిగా మారింది. అయినా మాల్‌వేర్‌(వైరస్‌) మెయిల్‌ ఏ ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చిందన్న కోణంలో తెలుసుకునే పనిలో పడ్డారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ మెయిల్‌ ఎవరు పంపించారనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సిబ్బంది అంటున్నారు. ఇక్కడివారే కావాలని పంపించారా, లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చిందా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top