వారి జవాబు పత్రాలు ఇవ్వండి

Highcourt Orders to Inter Board on Suicide Students - Sakshi

ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థుల విషయంలో హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థుల జవాబు పత్రాలు తమకు ఇవ్వాలని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, పిల్లల ఆత్మహత్యలకు ఇంటర్‌ బోర్డు అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీం అక్తర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అఫిడవిట్‌ ద్వారా వివరాలను హైకోర్టుకు నివేదించామని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల జవాబు పత్రాల నకళ్లను కూడా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌ కుమార్‌ చెప్పారు.

1.8 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు
ఇంటర్‌ బోర్డు కారణంగానే 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి మార్కుల మెమోలు, రీవెరిఫికేషన్‌ తర్వాత వారి జవాబు పత్రాలను ప్రభుత్వం కోర్టుకు నివేదించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదించారు. వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థుల జవాబుపత్రాలు, మార్కుల జాబితాలు డౌన్‌లోడ్‌ కాలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వివరాలన్నింటినీ అఫిడవిట్‌ ద్వారా హైకోర్టుకు నివేదించాలని బోర్డును ఆదేశించింది. దీనిపై సంజీవ్‌ కుమార్‌ అభ్యంతరం చెబుతూ.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను రీవెరిఫికేషన్‌ చేసి గత నెల 27న వాటి నకళ్లను వెబ్‌సైట్‌లో పెట్టామని చెప్పారు. మొత్తం 9,24,290 జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే 1.8 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించారు.

ఆత్మహత్యలకు పాల్పడిన 23 మంది ఫలితాలు..
రీవెరిఫికేషన్‌లో 1,183 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని, అందులో 582 మంది ఇంటర్‌ ద్వితీయ పరీక్షల్లోనూ, మిగిలిన 601 మంది ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణులయ్యారని సంజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన 23 మంది విద్యార్థుల్లో ఇద్దరు అప్పటికే ఉత్తీర్ణులయ్యారని, ఒక విద్యార్థి మాత్రం మూడు సబ్జెక్టులకు పరీక్షలు రాసి మిగిలిన మూడు సబ్జెక్టులు రాయలేదని తెలిపారు. కాగా, ఇంటర్‌ తొలి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు శుక్రవారం (జూన్‌ 7) నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ పరీక్షల కోసం 4,63,236 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విచారణకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top